మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (07:19 IST)

లాక్ డౌన్ తో తిరుమల ఘాట్ రోడ్లపై జింకలు, చిరుతల సంచారం

శ్రీనివాసా గోవిందా .. శ్రీ వేంకటేశా గోవిందా .. అంటూ ఆ దేవదేవుడి నామ స్మరణతో మారుమోగే తిరుమల గిరులు ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయాయి.

లాక్ డౌన్ ప్రభావంతో శ్రీవారి ఆలయానికి భక్తుల దర్శానలను రద్దు చేసి స్వామీ వారి నిత్య కైంకర్యాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్న టీటీడీ తిరుమల కొండపైకి వెళ్ళే ఘాట్ రోడ్ ను మూసి వేసింది. ఇప్పుడు ఏకంగా రెండు వారాలుగా ఆలయం మూత, ఘాట్‌రోడ్లపై రాకపోకల నిషేధంతో నిశ్శబ్దం ఆవరించింది. 1

28 ఏళ్ల క్రితం తిరుమల ఆలయం రెండు రోజుల పాటు మూసివేసిన సందర్భం ఆలయ అర్చకులకు ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితుల నేపధ్యంలో తమ పూర్వీకులు చెప్పగా మననం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.
 
తిరుమల ఘాట్ రోడ్ల మీద స్వేచ్చగా తిరుగుతున్న వన్యమృగాలు
కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ తో నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమల గిరులు, ఝరులు, తరులు అన్ని నిశ్శబ్దంగా చూస్తున్నాయి. లాక్‌డౌన్‌తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు స్వేచ్చగా తిరుమల ఘాట్ రోడ్ల మీద సంచరిస్తున్నాయి.

మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల అడవుల్లోని జంతువులు తిరుమల వీధుల్లోకి వచ్చి తిరుగుతున్నాయి. శేషాచల అడవుల్లో ఉన్న వన్య ప్రాణులకు ఇప్పుడు తిరుమల వీధులు, ఘాట్ రోడ్లు ఆవాసంగా మారిపోయాయి. 
 
 
భయాందోళనలో తిరుమలలో స్థానికులు
తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో స్థానికులు నివాసం ఉంటున్న నేపధ్యంలో వన్య ప్రాణుల సంచారంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కల్యాణ వేదిక, శ్రీవారి సేవా సదన్‌ వద్ద చిరుతలు, ఎలుగు బంట్లు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

స్థానికంగా ఉన్న వారు కూడా బయట తిరగవద్దని చెప్తున్నారు. ఇక తిరుమల మ్యూజియం వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు విపరీతంగా తిరుగుతున్నాయి. ఇక అవి అక్కడ తిరుగుతున్న దుప్పులపై దాడికి దిగిన ఘటనలతో స్థానికులు భయపడుతున్నారు.
 
వన్య మృగాల సంచారంతో తిరుమలలో పకడ్బందీ ఆంక్షలు
తిరుమలకు వెళ్ళే రెండు ఘాట్‌ రోడ్లలో చిరుతల సంచారం బాగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం రెండు ఘాట్‌ రోడ్లను అనుసంధానం చేసే లింక్‌ రోడ్డులో చిరుత సంచరించినట్టుగా గుర్తించారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది భయభ్రాంతులకు గురి అయ్యారు.

ఇక టీటీడీ, అటవీ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మొదటి ఘాట్‌ రోడ్డుపై జింకలు, దుప్పులు సైతం గంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వన్య మృగాలు జనావాసంలోకి వస్తుండడంతో సాయంత్రం తరువాత బయట తిరగరాదని టీటీడీ, పోలీసు అధికారులు స్థానికులకు గట్టి ఆంక్షలు విధించారు.
 
ఊపిరి తీసుకుంటున్న వన్య ప్రాణులు ... టెన్షన్ పడుతున్న స్థానికులు
వన్య ప్రాణులకు హాని చెయ్యరాదని, అలాగే వారు ప్రమాదం బారిన పడొద్దని వారు అంటున్నారు. ఇక స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్, ఈస్ట్‌ బాలాజీ నగర్లలో సైతం చిరుతలు, అడవి పందులు, దుప్పి, పాముల సంచారం అధికంగా ఉంటోంది.

ఇక పాపవినాశనం మార్గంలో గజరాజుల గుంపు సంచరిస్తోంది. మొత్తానికి శేషాచల వనాలలో ఉన్న వన్య మృగాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల మీదకు వచ్చి తిరుగుతున్న పరిస్థితి. ఇది ఒకరకంగా వన్య ప్రాణులు స్వేచ్చగా ఊపిరి తీసుకోవటమే అయినా వాటి సంచారం మాత్రం జనాలకు టెన్షన్ కలిగిస్తుంది అని చెప్పాలి.