తిరుమలలో ఇక అలా దర్శనాలు ఉండవు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన విషయంపై ఆ దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ఆయా ప్రభుత్వాల సూచన మేరకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పారు. అయితే, గతంలోలా వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండవని సుబ్బారెడ్డి తెలిపారు.
కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు. క్యూలైన్లలో పలు మార్పులు ఉంటాయని చెప్పారు. ఒక్కో భక్తుడు కనీసం ఒక మీటర్ భౌతి దూరాన్ని పాటించేలా చూస్తామని వివరించారు.
లాక్‌డౌన్ ఎత్తేశాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తామని అన్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు తిరుమలలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.