ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:30 IST)

విజయవాడ మేయరు అభ్యర్థిత్వం కోసం బేరాలు

విజయవాడ మేయరు అభ్యర్థిత్వం కోసం అప్పడే బేరాలు ప్రారంభమయ్యాయి. అధికార పార్టీలో ఇంకా మేయరు అభ్యర్ధిని ప్రకటించలేదు. ఏ నియోజకవర్గానికి దక్కుతుందనేది ఆసక్తికరం. ఆశావాదులు చాలా మంది ఉన్నారు. ఖర్చు పెట్టే స్థోమత కూడా చాలా మందికి ఉంది. మేయరు పదవి ఈ సారి జనరల్‌ మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.

గత ఏడాది మార్చిలో జరగాల్సిన ఎన్నికలను నిలుపుదల చేశారు. అప్పటికే రెండు పార్టీల్లో నామినేషన్లు దాఖలు అయ్యాయి. పరిశీలన పూర్తయింది. ప్రస్తుతం పురపాలక సంఘాల ఎన్నికల షెడ్యూలను ఎస్‌ఈసీ ప్రకటించింది. ఎక్కడ ఆగిపోయాయో తిరిగి అక్కడి నుంచే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ నుంచి ప్రారంభం కానుంది.

మార్చి 2 నుంచి ఉపసంహరణ ప్రారంభం అవుతుంది. మార్చి 10న ఎన్నికలు జరుగుతాయి. రాజకీయపార్టీల పరంగా జరిగే ఎన్నికలు కావడంతో ఆసక్తి నెలకొంది. తెదేపా పార్టీ తరఫున మేయరు అభ్యర్థినిగా ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత తనను తాను ప్రకటించుకున్నారు. గెలిస్తే తొలి సంతకం డ్రైనేజీల ప్రక్షాళన, మలి సంతకం ఆస్తి, నీటి పన్నుల పెంపును సమీక్షిస్తానని ప్రకటించారు.

పశ్చిమ నియోజకవర్గంలోనే ఎంపీ కేశినేని నాని ఆదివారం నుంచి పర్యటిస్తున్నారు. ఇక్కడి నేతలు మంత్రి వెలంపల్లికి అమ్ముడుపోయారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శ్వేత తూర్పు నియోజకవర్గం 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. మధ్య నియోజకవర్గానికి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండు చేస్తున్నారు. బలహీన వర్గాలకు ఇచ్చే ఆలోచన ఉందని పార్టీలో కొన్ని వర్గాలు అంటున్నాయి.

వైకాపాలో పోటీ..!
మేయరు అభ్యర్థిత్వానికి వైకాపాలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. సీఎంతో సన్నిహిత సంబంధాలున్న వారు తమకే అని ప్రచారం చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ యువనేత డిప్యూటీ మేయరు పదవి కావాలని డిమాండు చేస్తున్నట్లు తెలిసింది. సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థినులు ఉన్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు కాబట్టి తన కూతురుకు మేయరు అభ్యర్థిత్వానికి అవకాశం కల్పించాలని ఓ నేత కోరుతున్నాట్లు తెలిసింది. ఓ మంత్రి సన్నిహితులు, గతంలో కార్పొరేషన్‌లో కీలకభూమిక పోషించిన ఓ మహిళా నేత సైతం ఆశలు పెట్టుకున్నారు.

సీఎంతో సన్నిహితంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నాయకుడి భార్య ఇప్పటికే ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. మొత్తం మీద బెజవాడ పోరు ఆసక్తికరంగా మారింది.