బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మే 2021 (17:34 IST)

ఏపీలో వింత ప్రభుత్వం.. వింతైన సీఎం.. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత ప్రభుత్వం, వింతైన ముఖ్యమంత్రి ఉన్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా? అని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు నిలదీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఓ నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చేసిన దాడి వాస్తవమేననని నివేదిక వస్తే.. దాని అర్థం వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా నోరు విప్పితే బొక్కలో వేసి, నాలుగు ఉతికి పంపిస్తామని చెప్పడానికి చేసిన ప్రక్రియని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. 
 
రాఘురామ అరెస్టుపై స్పందించిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీలో ఉన్నవాళ్లకే ఇలా చేస్తే, ఇక ప్రతిపక్ష నేతల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో కక్ష్య సాధింపులు పెరిగిపోయాయని మండిపడ్డారు.
 
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఏం మాట్లాడారో తెలియదా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు.
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు రాష్ట్రంలో ప్రతి ఊరు తిరిగి ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సూచించారు. కనీసం ఆ ప్రాంతాల ఎమ్మెల్యేల దగ్గర నుంచి అయినా సమాచారం రాబట్టుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని మాట్లాడనివ్వరని, కలవడానికి సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరని ‘ఇదొక వింత ప్రభుత్వం.. వింతైన ముఖ్యమంత్రి’ అని ఆయన అన్నారు.
 
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఎంపీ రఘురామ వ్యాఖ్యలు ఉన్నాయని ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను అస్థిరపర్చడానికి వైసీపీ సోషల్ మీడియాలో న్యాయమూర్తులను ముక్కలు ముక్కలుగా నరికేయాలని చెప్పినప్పుడు అది అస్థిరపర్చడం కాదా? అని అన్నారు. 
 
అలాగే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబుపై నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యాలు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం కాదా? అని ప్రశ్నించారు. దానికంటే రాఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఎక్కువా? అని నిలదీశారు. ఒక నియంతగా రాష్ట్రంలో పాలన జరుగుతోందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.