గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (16:59 IST)

మోదీ ఫోటో వేయరా? బీజేపీతో పొత్తు వద్దంటే చెప్పేయండి: సోము వీర్రాజు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపును నమోదు చేసుకున్న నేపథ్యంలో.. ఏపీ బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. దీనికి తోడు 2019 ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ సర్కారుపై విమర్శలు చేయడం మొదలెట్టార

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపును నమోదు చేసుకున్న నేపథ్యంలో.. ఏపీ బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. దీనికి తోడు 2019 ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ సర్కారుపై విమర్శలు చేయడం మొదలెట్టారు. ఇప్పటి నుంచే ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇన్నాళ్లు టీడీపీపై విమర్శలు చేయకుండా మిత్రపక్షమంటూ మిన్నకుండిన బీజేపీ నేతలు ప్రస్తుతం గళం విప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేస్తామని చెప్పడం తప్పైందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఏపీ కోసం బీజేపీ ఎంత చేసినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బొమ్మను వేయట్లేదని సోము వీర్రాజు చెప్పారు. మోదీ చేపట్టిన కార్యక్రమాల వల్లే మంత్రి నారా లోకేష్‌కు ఎక్కువ ప్రైజులు వచ్చాయని వీర్రాజు తెలిపారు. అయినా కేంద్రం నిధులు ఇస్తున్న కార్యక్రమాలకు కూడా మోదీ ఫొటోను వాడటం లేదన్నారు. ప్రతీసారీ అడగడంతో లోకేష్ పక్కన మోదీ చిన్న బొమ్మను పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
బీజేపీ బలపడుతున్న ప్రతిసారి ఏదో ఒక చోట ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన తర్వాత ప్రత్యేక హోదా మాటెత్తి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఎక్కడో ఓ చోట రచ్చ చేస్తున్నారన్నారు. ఏపీలో టీడీపీ బలోపేతం కావచ్చు కాని, బీజేపీ కాకూడదా? అని ప్రశ్నించారు. ఒక వేళ బీజేపీతో పొత్తు వద్దని భావిస్తే... ఆ విషయాన్ని చంద్రబాబు బహిరంగంగా చెప్పాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు.