గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (19:45 IST)

అబద్దాలకోరు విజయసాయి... కేంద్రానికి సంబంధం లేదు : సుజనా చౌదరి

వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అబద్దాలు చెప్పొద్దంటూ హితవు పలికారు. పైగా, ఏపీలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు చెప్పి, వారి ఆశీస్సులతోనే ఏపీకి చెందిన ఏ నిర్ణయాన్ని అయినా సీఎం జగన్ తీసుకుంటున్నారన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే సుజనా చౌదరి ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చారు. 
 
ప్రధాని, హోం మంత్రితో చర్చించి రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నామని విజయసాయిరెడ్డి చెప్పడం కరెక్టు కాదన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపాలన ఉండదన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. 
 
ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా ఆశీస్సులు తీసుకున్నాకే జగన్ ఏ నిర్ణయం అయినా తీసుకుంటారంటే అర్థమేంటి? అని ప్రశ్నించిన సుజనా చౌదరి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. మోడీ, షాలకు చెప్పి చేస్తే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో కేంద్రం నుంచి లేఖలు ఎందుకు వెళ్తాయని సుజనా చౌదరి ప్రశ్నించారు.