సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (15:35 IST)

జేపీ నడ్డా కాదు.. పచ్చి అబద్ధాల అడ్డా : కేటీఆర్ ధ్వజం

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన జేపీ నడ్డా కాదనీ పచ్చి అబద్దాల అడ్డా అంటూ మండిపడ్డారు. పైగా, కర్ణాటకలో సాగించిన రాజకీయాలు తెలంగాణలో సాగవంటూ హెచ్చరించారు. బీజేపీ నేతలు అధికార మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి అంటూ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవడానికే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రాజెక్టుల నిర్మాణాలకు సహకరించాల్సింది పోయి విమర్శించడం సరికాదన్నారు. 
 
ముఖ్యంగా మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. మిషన్‌ కాకతీయను నీతి ఆయోగ్‌ ప్రశంసిస్తే.. మీకు కనిపించడం లేదా? బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, అధికారులు తెలంగాణలోని పథకాలను ప్రశంసిస్తుంటే.. నడ్డాకు కనిపించడం లేదా? కాంగ్రెస్‌ నేతలు అవినీతి అంటూ కాకిగోల పెడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ చాలా మెరుగైన కార్యక్రమం అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.