శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: సోమవారం, 19 ఆగస్టు 2019 (12:39 IST)

టీడీపీ షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి తేరుకోలేని షాక్ తగలనుంది. ఆ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదేవిషయంపై ఆయన సోమవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. ఈయన టీడీపీని వీడి బీజేపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఈ తాజా పరిణామం చర్చనీయాంశంగా మారింది. 
 
బీజేపీ కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న నేత ద్వారా ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హోదాలో ఉండి కూడా ఆదినారాయణ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన టీడీపీలో చేరాక జమ్మలమడుగు టీడీపీ ముఖ్య నేతగా ఉన్న రామసుబ్బారెడ్డితో విభేదాలు తలెత్తాయి. చంద్రబాబు సయోధ్య కుదిర్చినా ఆదికి పరాజయం తప్పలేదు.
 
దీంతో కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డిపై రాజకీయంగా బాగా ఒత్తిడి ఉంది. ఎందుకంటే.. జగన్ ఇలాఖా అయిన కడప జిల్లాలో కొన్నేళ్లుగా ఆదినారాయణరెడ్డి ఆయననే సవాల్ చేస్తూ వచ్చారు. దాని ప్రభావం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆదినారాయణ రెడ్డిపై ఎక్కువగా ఉంది. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ ఒత్తిడిని అధిగమించాలంటే బీజేపీలో చేరడమే మార్గమని ఆదినారాయణ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చిన కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం.