శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 16 ఆగస్టు 2019 (22:07 IST)

నాకు మళ్లీ ఫోన్ చేయొద్దండీ... పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఎవరికి?

భారతీయ జనతాపార్టీలోకి జనసేన పార్టీని విలీనం చేసేస్తారన్న ప్రచారం గత నెలరోజుల నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌ ధృవీకరించకపోగా జనసేన పార్టీ నేతల్లో మాత్రం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది బిజెపి నేతలు జనసేనానితో టచ్‌లో కూడా ఉన్నట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు.
 
తన అన్నతో పాటు బిజెపిలో చేరి కీలక పదవులు తీసుకోవాలన్నది పవన్ కళ్యాణ్‌ ఆలోచన అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మెగా ఫ్యామిలీపై భాజపా నేతలు గురిపెట్టారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే మొదట్లో బిజెపితో కలిసేందుకు పవన్ ఇష్టపడినా ఆ తరువాత కమ్యూనిస్టుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం.. సొంత పార్టీ నేతల నుంచి విమర్సలు రావడంతో ఇక వెనక్కి తగ్గారు.
 
అందులోను జాతీయ పార్టీతో జనసేనను కలిపితే తనపై దుష్ర్పచారం వస్తుందన్న భావనకు వచ్చేశారట పవన్ కళ్యాణ్‌. అందుకే గత రెండురోజుల క్రితం బిజెపి కీలక నేతలు పవన్ కళ్యాణ్‌‌కు ఫోన్ చేస్తే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట‌. నేను ఆ ఆలోచనను మానుకున్నా.. నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దండి.. నాకు ఫోన్ చేయొద్దండి.. అంటూ గట్టిగానే మాట్లాడారట. 
 
ఇది కాస్త జనసేన పార్టీ నేతలకు సంతోషాన్ని తెప్పించేసిందట. జనసేన స్వతంత్ర్య పార్టీగా ఉండాలే తప్ప ఎవరి కిందా పనిచేయకూడదన్నది ఆ పార్టీ కార్యకర్తల ఆలోచన. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌ స్పష్టం చేయడం.. మళ్ళీ ప్రజల్లోకి పవన్ కళ్యాణ్‌ వెళుతుండటం పార్టీ పటిష్టపడే అవకాశం ఉందన్న నిర్ణయానికి పార్టీ నేతలు వచ్చేశారట.