సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (18:29 IST)

సాధినేని యామినికి బంపర్ ఆఫర్.. కాశీ ఆలయానికి అధికార ప్రతినిధిగా..! (Video)

తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సాధినేని యామిని అనంతరం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగినన్ని రోజులు ఆమె క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుని పడేవారు. ఓ రకంగా టీడీపీ మహిళా నేతల్లో ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 
 
ఎన్నికల తరువాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. టీడీపీలో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయారు. ప్రత్యమ్నాయంగా బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తరువాత క్రియాశీలక రాజకీయాల వైపు పెద్దగా కనిపించలేదు. పరిమిత సందర్భాల్లో తప్ప ఆమె ఎప్పుడూ జనం ముందుకు రాలేదు. తెరమరుగు అయ్యారని అనుకుంటోన్న లోపే.. ప్రతిష్ఠాత్మక పదవిని అందుకున్నారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన నగరంగా.. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న కాశీ విశ్వనాథుడి ఆలయ ప్రతినిధిగా నియమితులు అయ్యారు. 
 
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకురాలైన సాధినేని యామనికి కీలక పదవి వరించింది. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. సాక్షాత్ పరమ శివుడే కొలువయ్యాడని భావించే కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయ ట్రస్టు దక్షిణాది రాష్ట్రాల అధికార ప్రతినిధి బాధ్యతలను ఆమెకు అప్పగించారు.
 
కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టు పరిధిలో ఇప్పటిదాకా దక్షిణాది రాష్ట్రాల అధికార ప్రతినిధి అనే పోస్ట్ లేదు. కొత్తగా ఆ పోస్టును ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాశీ విశ్వనాథుడి ఆలయ ప్రచార కార్యక్రమాలను ఆమె పర్యవేక్షించాల్సి ఉంటుంది. 
 
తిరుమల తరహాలో దక్షిణాది రాష్ట్రాల్లో కాశీ విశ్వనాథుడి ట్రస్టు పరిధిలో ఉన్న ఆలయాల నిర్వహణ, ఆదాయ వ్యయాలు వంటి అంశాలను పర్యవేక్షించే బాధ్యతను సాధినేని యామినికి ఇచ్చారు. వారణాసికి వచ్చే భక్తుల సౌకర్యాల గురించి దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టాల్సి ఉంటుంది.