మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (17:48 IST)

రైతులకు నష్టం కలిగిస్తే దుకాణాల లైసెన్సులు రద్దు: మంత్రి మోపిదేవి

రైతులకు నష్టం కలిగించే దళారులు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నష్టం కలిగిస్తే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు.

నేటి నుండి ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చిక ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

కరోనా వైరస్ వల్ల ప్రజలకు ప్రాణనష్టం కలగకూడదని ఒకవైపు, నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటూ మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. కరోనా ప్రభావం వల్ల ఆక్వా రంగంతో పాటు పౌల్ట్రీ రంగం కొంత ఇబ్బందులకు గురి అవుతున్న మాట వాస్తవమన్నారు. అంతేతప్ప కరోన వైరస్ వలన ఆక్వారంగ పరిశ్రమలు మూతపడతాయని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆక్వా సాగుకు ఏప్రిల్, మే, జూన్ నెలలు చాలా కీలకమైన నేపథ్యంలో ఆక్వా రంగం దెబ్బతినకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు.

అందులో భాగంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి దారులతో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తానూ చర్చలు జరిపామన్నారు. ఆక్వా ఎగుమతిదారులు, సంబంధిత శాఖాధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోందని, మన రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తులకు నాణ్యత విషయంలో మంచి పేరుందని మంత్రి తెలిపారు.

90 శాతం ఉత్పత్తులు అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్రం ఉలో ఆక్వా అత్యంత ప్రధానమైన, ఆదాయం అర్జించే రంగమని చెబుతూ ఆక్వా రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తున్నామన్నారు.

దేశంలో 47 శాతం ఆదాయం, రాష్రం యలో ప్రధానంగా అత్యధిక ఆదాయం ఆక్వా రంగం నుండి వస్తుండటంతో రొయ్యల రైతులు నష్టపోకుండా ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 30 కౌంట్ నుంచి 100 కౌంట్ వరకు రొయ్యల ధర నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ధరల పట్టికను మంత్రి చదివి వినిపించారు.

30 కౌంట్ కేజీ ధర రూ.430 కాగా, 40 కౌంట్ ధర రూ.310, 50 కౌంట్ ధర రూ.260, 60 కౌంట్ ధర రూ.240, 70 కౌంట్ ధర రూ.220, 80 కౌంట్ ధర రూ.200, 90 కౌంట్ ధర రూ.190, 100 కౌంట్ ధర 180 రూపాయలుగా నిర్ణయించామన్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇలా ముందే స్థిరమైన ధరలు నిర్ణయించడం దేశంలోనే మొదటిసారి అని మంత్రి తెలిపారు.

ఆక్వా రైతుల కోసం ఏ రాష్ట్రం కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఆక్వా ఉత్పత్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగుమతులు ఆగడానికి వీలులేదన్నారు. 5,6 రోజులుగా ఇదే విషయమై జిల్లా యంత్రాంగం, ఆక్వా రైతు సంఘాలు, ఎగుమతిదారులతో చర్చలు జరిపుతున్నామన్నారు.

కరోనాతో సంబంధం లేకుండా రైతు పండించిన పంటను ఏ ప్రాంతంలో అయినా కొనుగోలు చేయడానికి ఎగుమతిదారులు ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇది స్వాగతించాల్సిన అంశమని కొనియాడారు. ఆక్వా రైతులకు అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ఆసరా చేసుకొని కరోనా వైరస్ పేరుతో దళారుల మాటలను నమ్మి ఆక్వారంగం రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు అమ్మేందుకు వీలు లేదని ఆక్వా రైతులకు సూచించారు. హడావిడిగా సాగుచేసిన ఉత్పత్తులను అమ్ముకోవద్దని రైతులను అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎంపెడా కు అధికారాలు ఇస్తున్నామని తెలిపారు.

ఆక్వాకు సంబంధించిన ఉత్పత్తులు సీడ్ వేయడం, ఫీడ్ ను అందించడం, ప్రాసెసింగ్ నిర్వహణ, రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్నారు. ఈ విషయంలో పోలీస్, రెవెన్యూ, వాలంటీర్లు సహకరించాలన్నారు. ఎగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు సంబంధించి ఎక్స్ పోర్ట్ ఇన్స్పెక్షన్ అథారిటీ(ఈఐఏ)నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాకు మత్స్యశాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్ ను నోడల్ ఆఫీసర్ గా నియమిస్తున్నామన్నారు. ఏ ఇబ్బందులున్నా వీరితో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. విదేశాల నుంచి  రా మెటీరియల్  తెప్పించే విషయంలో వీరు పనిచేస్తారన్నారు. 

అదే విధంగా ఆక్వా పరిశ్రమలో పనిచేసే సిబ్బంది సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందిగా మంత్రి సూచించారు. శానిటైజర్స్ ను వినియోగించాలన్నారు.  సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూశాఖ పాస్ లు జారీ చేస్తుందన్నారు. నోడల్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. మానిటరింగ్ కమిటి ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు  ఫిర్యాదులు చేయవచ్చన్నారు.

ఫౌల్ట్రీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందంటున్న మాట వాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. ఈ రంగంపై ఆధారపడి చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఈ రంగం కుదేలవుకుండా నిలబెట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుడ్లు, చికెన్ ను మార్కెట్ లో అమ్ముకునేందుకు, రవాణాకు అన్ని  చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అదే విధంగా ఆక్వా, మత్స్య, ఫౌల్ట్రీ నుంచి వచ్చే వ్యర్థపదార్థాలను రవాణా చేసేందుకు అన్ని రకాల అనుమతులు ప్రభుత్వం చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఫౌల్ట్రీ రంగం రూ.60 లక్షలు అందజేసిందన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

ఇతర దేశాల నుంచి గడచిన రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు 25 వేలకు పైగా మంది వచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. లక్షలాది మంది రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషిచేస్తున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు. అంతకుముందు ఆక్వా ఎగుమతిదారులు, మత్స్య శాఖాధికారులతో మంత్రి మోపిదేవి తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మత్స్య శాఖ కమిషనర్ సోమశేఖర్, ఎంపెడా జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఆక్వా ఎగుమతిదారులు, అధికారులు పాల్గొన్నారు.