సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (10:27 IST)

హస్తినకు పయనమైన కన్నా ... రాజధాని తరలింపుపై అగ్రనేతలతో...

రాజధానిని మూడు ముక్కలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా, ఒక్క అధికార వైపాపా మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఈ మూడు ముక్కలాటను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన తరలి వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరుగుతున్న తరుణంలో ఆయన ఒంటరిగా ఢిల్లీ వెళ్లడం రాష్ట్ర పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 
రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన స్థానంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ యువ నాయకుడిని నియమించబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా (జేపీనడ్డా) నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకే ఆయన హస్తిన వెళ్లారని బీజేపీలోని కొన్ని వర్గాలు అంటున్నాయి. 
 
అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ చర్చించిన తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. అయితే, రాజధాని అమరావతిలోనే ఉంటుందని పవన్ కళ్యాణ్ బలంగా చెబుతున్నారు. ఆయన మాటలు ఎంతవరకు నిజమవుతాయో వేచిచూడాల్సిందే.