శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 22 మే 2017 (21:26 IST)

రేషన్ దుకాణాల్లో కార్డ్ ద్వారా నగదు చెల్లిస్తే... 13 జిల్లాల్లో 13 మందికి రూ. 13 లక్షలు... పుల్లారావు

అమరావతి: రేషన్‌ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వినియోగదారులకు ప్రభుత్వం ప్రోత్సాహాకాలను ప్రకటించింది. మొదటి కేటగిరి కింద 13 జిల్లాల నుంచి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ప్రకటించింది. రెండవ కేటగిరి కింద 13 జిల్లాలకు చెందిన 5,000 మందికి స్మా

అమరావతి: రేషన్‌ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వినియోగదారులకు ప్రభుత్వం ప్రోత్సాహాకాలను ప్రకటించింది. మొదటి కేటగిరి కింద 13 జిల్లాల నుంచి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ప్రకటించింది. రెండవ కేటగిరి కింద 13 జిల్లాలకు చెందిన 5,000 మందికి స్మార్ట్ ఫోన్లు అందజేయనున్నారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మే నెలకు గాను చౌక డిపో నగదు రహిత లావాదేవీల నిర్వహించిన విజేతలను పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు డ్రా ద్వారా ఎంపిక చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ దుకాణాలలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందులో ఎటువంటి నిర్బంధమూ లేదని, కార్డుదారుల ఇష్టపూర్వకంగానే నగదు రహిత లావాదేవీలు చేపట్టామన్నారు. ఇలా క్యాష్‌లెస్ ద్వారా రేషన్‌ సరుకులను తీసుకున్న కార్డుదారులలో ప్రతి జిల్లా నుంచి డ్రా ద్వారా ఒకరిని ఎంపిక చేశామన్నారు. వారికి రూ. లక్ష నగదు బహుమతి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 వేల మందికి స్మార్ట్ ఫోన్లు అందజేస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రోత్సాహాకాలను విజేతలకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
 
రాష్ట్రవ్యాప్తంగా కృష్ణాజిల్లాలో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రజలను చైతన్యవంతులను చేసి, నగదు రహిత లావాదేవీలపై మొగ్గు చూపేందుకు ఈ ప్రోత్సహాకాలు దోహదపడతాయన్నారు. ప్రజలను బలవంతంగా కాకుండా, వారికి అవగాహన కల్పించి వంద శాతం నగదు రహిత లావాదేవీలను చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కచ్చితంగా నగదు రహితంగానే సరుకులు తీసుకోవాలనే నిబంధనైతే లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరల శాఖ ఐటి విభాగానికి చెందిన డిప్యూటి డైరెక్టర్ విజయలక్ష్మి, జాతీయ సమాచార కేంద్రం టెక్నికల్ డైరెక్టర్లు శ్రీమతి రాధ, వాసుదేవరావు, గురుప్రసాద్, ఏకేవీకే రావు మరియు శ్రీమతి అన్నపూర్ణ "సైంటిస్ట్ డి" తదితరులు పాల్గొన్నారు.