మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (17:36 IST)

జనసేనతో ప్రయాణం ముగిసింది... ఇక రైతులతోనే... వీవీ లక్ష్మీనారాయణ (video)

జనసేనతో తాను సాగిస్తూ వచ్చిన ప్రయాణం ముగిసిందని, అంటే... ఇక అది ముగిసిన అధ్యాయం అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన రాజీనామా లేఖను ఆ పార్టీ ఆమోదించినందున దాని గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నారు. ఇకనుంచి తన ప్రయాణమంతా రైతుల కోసం సాగుతుందన్నారు.
 
రైతుల సంక్షేమం కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరతానన్న విషయం త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు మాత్రమే మార్గమని అభిప్రాయపడ్డారు.
 
ఈ సందర్భంగా ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. కేంద్ర బడ్జెట్ ప్రజా హితంగా ఉందని, పలు రంగాలకు కేటాయింపులు బాగున్నాయన్నారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. 
 
అనుబంధ బడ్జెట్‌లో ఏపీకి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీకి నిధుల కోసం ఎంపీలు ప్రయత్నించాలని సలహా ఇచ్చారు.