గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (07:42 IST)

డియర్ లక్ష్మీ నారాయణ.. నాకు పాల ఫ్యాక్టరీలు లేవు... : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తూనే అధినేత పవన్ కళ్యాణ్‌పై పలు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, పవన్‌ది నిలకడలేని మనస్తత్వమంటూ విమర్శలు చేశారు. దీనిపై జనసేనాని చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మనోభావాలను గౌరవిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
అందులో పవన్.. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లేవని పేర్కొన్నారు. అత్యధిక జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగినీ కానని స్పష్టం చేశారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని, తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని వివరించారు.
 
వారి కోసం, తన కుటుంబం కోసం, పార్టీని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తాను సినిమాలు చేయక తప్పదని పవన్ స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ రాజీనామా చేయడానికి ముందు ఇవన్నీ తెలుసుకుని ఆ లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 
 
పార్టీకి ఆయన రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా తనకు, జనసైనికులకు ఆయనపై గౌరవం ఎప్పటికీ అలానే ఉంటుందన్నారు. ఆయనకు శుభాభినందనలు తెలుపుకుంటున్నట్టు పవన్ పేర్కొన్నారు
 
అంతకుముందు, జనసేనానికి లక్ష్మీనారాయణ రాసిన లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లడమే తన రాజీనామాకు కారణమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
 
"ప్రజల కోసం ఈ జీవితం అంకితం అని మీరు మొదట చెప్పారు. సినిమాలు చేయనని స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. మీకు నిలకడలేదన్న విషయం ఈ నిర్ణయంతో వెల్లడైంది. అందుకే నేను జనసేన నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అంటూ లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాగా, అజ్ఞాతవాసి తర్వాత టాలీవుడ్ కు దూరమైన పవన్ మళ్లీ ఇన్నాళ్లకు సినిమాలు చేస్తున్నట్టు మీడియాలో వచ్చింది. ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నట్టు సమాచారం.