ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏపీఎం అధినేత శరవణన్ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. వీరిలో సీనియర్ నటుడు శివకుమార్, ఆయన కుమారుడు సూర్య కూడా ఉన్నారు. వీరిద్దరూ శరవణన్ భౌతికాయానికి నివాళులు అర్పిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా శరవణన్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని, కంటతడి పెట్టుకున్నారు.
అలాగే, తమిళనాడు సీఎం స్టాలిన్, రజనీకాంత్, సూర్య తండ్రి శివకుమార్ తదితరులు నిర్మాత మృతదేహానికి నివాళులర్పించారు. శరవణన్ (85) చెన్నైలోని నివాసంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళం, తెలుగు సహా పలు భాషల్లో 300కిపైగా సినిమాలు నిర్మించారాయన. సూర్య నటించిన పేరళగన్ (సుందరాంగుడు), వీడొక్కడే తదితర చిత్రాలు ఏవీఎం ప్రొడక్షన్స్‌లోనే తెరకెక్కాయి.
శరవణన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. శరవణన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను చిన్న వయసులో.. శరవణన్‌ను కలిశానని, ఏవీఎం స్టూడియోస్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని విశాల్ గుర్తుచేసుకున్నారు.