శుక్రవారం, 5 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2025 (22:25 IST)

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

suicide
తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు జీర్ణించుకోలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, కుకునూరుపల్లికి చెందిన ఆశని శంకర్ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడికి ఒక కుమారుడు, కుమార్తె ఆశని శ్రావణి (18) ఉన్నారు. ఆమె ఇంటర్ పూర్తిచేసి ఇంటి దగ్గరే ఉంటూ కూలీ పనులకు వెళ్తుంది. శంకర్ కుటుంబ సభ్యులు ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఉంటే దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్ అలియాస్ రసీం బాబా వద్దకు వెళ్లేవారు. 
 
ఈ నేపథ్యంలో శ్రావణికి అక్కడ మహేష్‌తో పరిచయం ఏర్పడింది. ఇటీవల మహేష్ అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో శ్రావణి సరిగా ఇంట్లో తినకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వివరాలు ఆరా తీయగా.. మహేష్‌ను ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. 
 
ఇంతలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రావణి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే శ్రావణి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. తండ్రి శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.