శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (15:16 IST)

బీజేపీ - జనసేన లాంగ్ మార్చ్ వాయిదా :: పరువు నష్టం దావా వేస్తాం

ఏపీ ప్రజల కోసం కలిసి పని చేయాలని నిర్ణయించిన బీజేపీ - జనసేన పార్టీలు వచ్చే నెల రెండో తేదీన విజయవాడలో లాంగ్ మార్చ్‌ని తలపెట్టాయి. ఇపుడు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాయి. త్వరలోనే తాజా కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. లాంగ్ మార్చ్ ఎప్పుడు నిర్వహించబోయేది తదుపరి నిర్ణయిస్తామని వెల్లడించారు.
 
మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అమరావతి ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు 62 ఎకరాల మేర భూములు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన వర్గాలు మండిపడ్డాయి. పవన్ పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై పరువునష్టం దావా వేస్తున్నామని జనసేన పార్టీ న్యాయవిభాగం వెల్లడించింది. 
 
ఈ ప్రచారానికి కారకులకు లీగల్ నోటీసులు పంపుతామని జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కోలేక, జనసేన సాగిస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడుండడంతో ఎదురునిలిచి పోరాడలేని అల్పులే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.