మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (07:15 IST)

ఢిల్లీ వెళ్తున్నాం... అద్భుతాలు జరుగుతాయని చెప్పలేను.. కానీ.. : పవన్ కళ్యాణ్

మూడు రాజధానుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీవ్రతరం చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో చర్చించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన వెంట మరో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా వెళ్తున్నారు. 
 
ఈ ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్... బీజేపీ పెద్దలను కలుసుకుని అమరావతి రాజధాని మార్పు, రైతుల సమస్యలను ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు మరికొందరు కేంద్రమంత్రులతో పవన్ సమావేశంకానున్నారు. 
 
ఇదిలావుంటే, తన ఢిల్లీ పర్యటనపై తనను కలిసిన అమరావతి ప్రాంత మహిళా రైతులపై పవన్ మాట్లాడుతూ, తాను బుధవారం ఢిల్లీ వెళ్తున్నానని, అద్భుతాలు జరుగుతాయని చెప్పలేను కానీ మన బాధలను కేంద్ర పెద్దలకు వివరిస్తానని హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా శంకుస్థాపనలతో పాలన మొదలవుతుందని.. వైసీపీ మాత్రం కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిందని.. అదీ కూలిపోక తప్పదని హెచ్చరించారు. 
 
'జనసేన భావజాలాన్ని ఇష్టపడిన మోదీని కలవడానికే తాను ఢిల్లీ వెళ్లానని.. కేసులు మాఫీ చేయండని చెప్పుకోవడానికి కాదన్నారు. అసెంబ్లీ ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లు, అమరావతి మెట్రో డెవల్‌పమెంట్‌ బిల్లులపై సమగ్రంగా అధ్యయనం చేసి న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించాలని పవన్‌ పార్టీ లీగల్‌ విభాగాన్ని కోరినట్టు' చెప్పారు.