శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 20 జనవరి 2020 (22:06 IST)

అమరావతి రాజధాని అడుగు కూడా కదలదంతే, రాపాక సంగతి చూస్తా: పవన్ కళ్యాణ్

3 రాజధానుల నిర్ణయంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే... ''అమరావతి రాజధాని అనేది ఓ ఆటగా మారిపోయింది. అమరావతి రాజధాని తరలించామని అనుకుంటున్నారు కానీ అది ఓ అడుగు కూడా జరగదు. మా పార్టీ ఆఫీసు నుంచి బయటకు రానీయడంలేదు. జాతీయ స్థాయిలో ఈ సమస్యను మేము బలంగా తీసుకెళ్తాం. ఇది వైసీపి వినాశానానికి దారితీయబోతోంది. 
 
33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డున పడేశారు. లాఠీలతో కొట్టి రక్తం చిందించారు. ప్రభుత్వ నిర్ణయంపై మేం భాజపాతో కలిసి నిర్ణయం తీసుకుంటాం. అమరావతి రాజధాని కదిలించామని అనుకుంటున్నారేమో కానీ అది తాత్కాలికమే. రాజధాని అనేది ఓ ఆటగా మార్చేశారు. జనసేన 10 వేల ఎకరాలు చాలని చెప్పాను, కానీ ఆనాడు వైసీపీ సమర్థిస్తామని చెప్పి ఇప్పుడు రైతులను రక్తమొచ్చేట్లు కొడుతున్నారు. 
 
మా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారికి పార్టీ స్టాండ్ ఏమిటో తెలియజేశాము. కానీ ఆయన పార్టీ స్టాండుని విడిచిపెట్టి వైసీపీ స్టాండ్ తీసుకున్నారు. నాకు చాలా బాధ కలిగించింది. ఆయన గురించి పార్టీ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామ''ని చెప్పారు.