సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (10:38 IST)

రాజధాని వికేంద్రీకరణ వైసీపీ వినాశనానికి పునాది : పవన్ కళ్యాణ్

రాజధాని వికేంద్రీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ వినాశనానికి పునాది అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 5 కోట్ల మంది ఆంధ్రులు ఆమోదంతో ఏర్పడిన రాజధాని అమరావతి అని .. దానిని ఇక్కడ నుంచి కదిలించడం అసాధ్యమని అన్నారు. కాదు కూడదని కదిలించినా అది తాత్కాలికమేనని అన్నారు. ఈ విషయాన్ని గ్రామ గ్రామానికీ తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. 
 
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. బీజేపీ అగ్ర నాయకత్వం ఒకటే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అది ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు నిర్మించడాన్ని సమర్ధిస్తున్నాం. కానీ వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనసేన పార్టీ వ్యతిరేకం. మూడు రాజధానుల అంశం అచరణీయం కాదు. 
 
రాజధాని అంటే టీడీపీ, వైసీపీ పార్టీలకు ఆటైపోయింది. రాజధాని పేరుతో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇప్పుడు రాజధానిని మార్చి వైసీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. రెండు పార్టీలను బలంగా ఎదుర్కొంటాం అన్నారు పవన్ కల్యాణ్. ఇంతపెద్ద రాజధాని అవసరం లేదని ఆనాడే చెప్పాను. 
 
గాంధీనగర్ తరహాలో 10 నుంచి 14 వేల ఎకరాలు చాలన్నాను. టీడీపీ ప్రభుత్వం నా మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న నెపంతో ఏకంగా రాజధానినే వైసీపీ ప్రభుత్వం వైజాగ్‌కు తరలిస్తుంది. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో ఫ్యాక్షన్ కల్చర్, రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలని చూస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు తెలంగాణలో చేస్తే ఛీకొట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయాలని అనుకుంటున్నారు అని విమర్శించారు పవన్ కళ్యాణ్.