నేడు మండలికి మూడు ముక్కల బిల్లు... సభలో వీగిపోతే.. నెక్స్ట్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కారు అసెంబ్లీలో బిల్లుపెట్టి ఆమోదింపజేశారు. అసెంబ్లీలో పూర్తి సంఖ్యాబలం ఉందికాబట్టి బిల్లును ఆమోదించుకున్నారు. కానీ, శాసనమండలిలో అధికార పార్టీ కంటే విపక్ష పార్టీకే పూర్తి మెజార్టీ ఉంది. ఈ బిల్లును ఇక్కడ ఆమోదం పొందకుండా విపక్షం అడ్డుకుంటే తర్వాత ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ఈ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శాసనసభలో ఆమోదం తర్వాత ఈ బిల్లు ోమంగళవారం మండలికి చేరనుంది. మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉన్న విషయం తెలిసిందే. అక్కడ తెలుగుదేశం పార్టీ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును తిరస్కరించి వెనక్కు పంపడం తొలి ప్రత్యామ్నాయం. ఇదే జరిగితే శాసనసభలో రెండోసారి ఆమోదించి మళ్లీ మండలికి పంపుతారు. మండలికి మరోసారి వచ్చినప్పుడు తిరస్కరించకుండా సెలెక్ట్ కమిటీకి పంపడం రెండో ప్రత్యామ్నాయం.
బిల్లు మొదటిసారి వచ్చినప్పుడే సెలక్ట్ కమిటీకి పంపడం మూడో ప్రత్యామ్నాయం. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపితే అక్కడ రెండు మూడు నెలలపాటు ఆపడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల అప్పటిదాకా బిల్లు ఆమోద ప్రక్రియ పూర్తి కాదు. ఇందులో ఏ ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవాలన్నదానిపై టీడీపీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మంగళవారం నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అంత దూరం వెళ్లకుండా ఆపడానికి ప్రభుత్వ పక్షం తన వంతు ప్రయత్నం చేస్తోంది.
ఇది కుదరకపోతే ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత ఆరు నెలల్లోపు దానికి అసెంబ్లీ ఆమోదం పొందాలి. కానీ, ఆర్డినెన్స్ జారీకి గవర్నర్ ఆమోదం తెలపాలి. ఆయన దాన్ని కేంద్రం పరిశీలనకు పంపాలని నిర్ణయిస్తే మళ్లీ అక్కడ కూడా జాప్యం చోటుచేసుకొంటుంది. ఏ అడ్డంకులు లేకుండా ఆర్డినెన్స్ జారీ అయితే అక్కడి నుంచి విషయం కోర్టులకు మారే అవకాశం ఉంది. ఆర్డినెన్స్ జారీపై కోర్టులో పిటిషన్లు వేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కోర్టు స్టే ఇస్తే ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోతుంది. స్టే రాకపోతే ప్రభుత్వం తాను అనుకొన్నట్లు ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎలా ఉంటుందన్నదానిపైనా ఇపుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాజధానికి సంబంధించిన అంశాలపై కేంద్రం జోక్యం చేసుకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రాజధాని మార్పుపై తమకు ముందుగానే చెప్పారన్న వాదనలో నిజం లేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దేవధర్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.