శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (10:17 IST)

సీఎం అయితే ఏంటి? 11 చార్జిషీట్లలో ప్రథమ నిందితుడు...

ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని.. అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి కోరడం సరికాదని సీబీఐ స్పష్టం చేసింది. హాజరు మినహాయింపు ఏ నిందితుడికీ హక్కు కాదని, అది న్యాయస్థానం విచక్షణాధికారమన్నారు. 
 
నిందితుడి హోదా, ఆర్థిక స్తోమత కోర్టుపై ప్రభావం చూపలేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని తెలిపింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను కొట్టేయాలంటూ సీబీఐ హైదరాబాద్‌ విభాగం ఎస్పీ పీసీ కల్యాణ్‌.. 17 పేజీల కౌంటర్‌ అఫివిడవిట్‌ దాఖలు చేశారు.
 
అంతేకాకుండా, వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు కోరుతున్న వ్యక్తి 11 చార్జిషీట్లలో మొదటి నిందితుడు అని గుర్తుచేసింది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు కొందరు వ్యాపారవేత్తలు జగన్‌తో కుమ్మక్కయ్యారని, తమ కంపెనీలకు లబ్ధి పొంది...క్విడ్‌ ప్రొకొ పద్ధతిలో ఆ యన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపించింది. జగనే సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేశారని, అన్నీ ఆయన పర్యవేక్షణలోనే నడుస్తున్నాయని తెలిపింది. 
 
'ఈ కేసుల్లో నిందితులు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెల 10న ఒకసారి సీబీఐ కోర్టుకు జగన్‌ హాజరయ్యారు. దాదాపు 9 నెలలు సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద హాజరు మినహాయింపు కోరారు. సహేతుకమైన కారణాలు లేకుండానే మినహాయింపు కోరుతూ విచారణ ప్రక్రియకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా ఉంది' అని తెలిపింది. 
 
దాల్మియా కేసులో పునీత్‌ దాల్మియాకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందన్న కారణంగా జగన్‌ మినహాయింపు కోరడం సరికాదు. పునీత్‌ ఒక్క కేసులో నిందితుడు. జగన్‌ 11 చార్జిషీట్లలో ప్రథమ నిందితుడిగా ఉన్నారు. పునీత్‌తో పోలిస్తే ఆర్థికంగా కూడా ఆయన భారీగా లబ్ధిపొందారు. ఈ నేపథ్యంలో జగన్‌ పిటిషన్లను కొట్టివేయండి అని సీబీఐ అభ్యర్థించింది. ఈ పిటిషన్లపై హైకోర్టు ఏప్రిల్‌ 9న తుది విచారణ చేపట్టనుంది.