ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (21:30 IST)

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని జగన్ నీరుగారుస్తున్నారు: చంద్రబాబు

మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారు అనుభవిస్తున్న కష్టాలను గుర్తించి వారికంటూ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన కృషి, పోరాటం అజరామరమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి రాష్ట్రం నలు మూలల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైశ్య నాయకుల సమక్షంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డుండి రాజేశ్ వందనం సమర్పణ చేశారు.

అమర జీవితో తెలుగువారికి గుర్తింపు – పటేల్ పోరాటంతో ఐక్య భారతం
ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు, దేశ సమైక్యత కోసం తపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు పడిన కష్టానికి ప్రతిఫలంగా రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కంకణబద్దంగా పని చేసింది.

అడుగడుగునా తెలుగు ప్రజలు పడుతున్న అవమానాల నుండి విముక్తుల్ని చేయడం కోసం తన ప్రాణలు పణంగా పెట్టారు. స్వాతంత్ర్యోద్యమ స్పూర్తితో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం కోసం నాటి ప్రధాని నెహ్రూతో అవిశ్రాంత పోరాటం చేశారు. నిరాహార దీక్ష అంటే ఏంటో నిరూపించారు. ఆ దీక్ష చూసి దేశం కదిలింది. కర్నూలు రాజధానిగా భాషా ప్రయుక్త రాష్ట్రం సాకారమైంది. అక్కడ నుండి హైదరాబాద్ వెళ్లాం, తర్వాత అమరావతికి వచ్చాం. 

అమర జీవి ఆశయాలకు జగన్ రెడ్డి తూట్లు :
కుటుంబాన్ని, కార్యకర్తల్ని పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం తాపత్రయపడ్డాను. ప్రజలు, రాజకీయ పక్షాల అభిప్రాయాలు తీసుకుని ప్రపంచ స్థాయి రాజదాని నగరం నిర్మాణానికి శ్రీకారం చుడితే విమర్శించారు. నేడు అదే స్పూర్తితో ఢిల్లీలో గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. లక్షల కోట్ల ఆదాయం వచ్చే నగరాన్ని, నాటి కలల్నీ ఈ దుర్మార్గులు నాశనం చేస్తున్నారు.

అప్పుల కుప్ప చేశారు. భూములిచ్చిన రైతులపై కేసులు పెడుతున్నారు. బూటు కాళ్లతో తన్నారు. లాఠీలతో కుళ్లబొడిచారు. అవమానించారు. మూడు రాజధానులు అంటూ అభివృద్ధిని, లక్షల కోట్ల ఆదాయాన్ని ఇచ్చే అమరావతిని దెబ్బతీశారు. చివరికి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేశారు. 

వైశ్యులది త్యాగాల చరిత :
రాష్ట్రం కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గర్వకారణం. త్యాగాలు చేయడం వైశ్యులకు కొత్తేమీ కాదని అప్పుడే నిరూపించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీరాం తాతయ్య పార్టీ నిర్మాణంలో రాష్ట్ర అభివృద్ధిలో పడిన శ్రమ ఎన్నటికి గుర్తుంచుకుంటా.

ఇద్దరూ నాకు రెండు భుజాల్లా నిలుస్తున్నారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తాను. ఇప్పటికీ.. దుర్మార్గులతో పోరాటం చేస్తున్నారు. వ్యాపారాలపై దెబ్బకొట్టినా ఎదురొడ్డి పోరాడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రాబందుల రాజ్యం చేశారు. ప్రజల ఆస్తులు లాక్కుని బెదిరిస్తున్నారు. రౌడీలు, గూండాలను పెంచిపోషిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తులపై అక్రమంగా వాలిపోతున్నారు. ప్రజలు, అధికారులపై దాడులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో బాలికను అత్యాచారం చేసి చంపేస్తే.. పోస్టుమార్టం రిపోర్టు కూడా బయట పెట్టలేదు. పులివెందుల పంచాయితీలు పెరుగుతాయని ముందే హెచ్చరించాను. ఏదో చేస్తారని ఆశించిన ప్రజలు భంగపడ్డారు. దగాపడుతున్నారు.

పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. దాతలు ఇచ్చిన భూములకు కూడా రక్షణ లేదు. రాజకీయాల్లో పోటీ చేసేందుకు కనీస అవకాశం కూడా కల్పించడం లేదు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. దుర్మార్గుల చేతిక పాలన అందితే.. ఆ రాజ్యం అంతా అశాంతిమయమని జగన్ పాలన రుజువు చేస్తోంది.

జగన్ స్వామ్యంలో ప్రజలకు కష్టాలే :
వ్యక్తి స్వాతంత్ర్యాన్ని కూడా హరిస్తున్నారు. ఉచిత ఇసుకను రద్దు చేసి పిచ్చి పిచ్చి పాలసీలు తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల కడుపుకొట్టారు. వ్యాపారాలను నాశనం చేశారు. దెబ్బతిన్నవాళ్లంతా ఎదురు తిరిగితే పరిస్థితి ఏమిటో జగన్ రెడ్డి కనీసం ఆలోచించుకోవడం లేదు. గతంలో తుపాన్లు వస్తే ముందే హెచ్చరించి పరిస్థితిని సమీక్షించేవాళ్లం.

నేడు జగన్ రెడ్డి గాల్లో తిరగడం తప్ప చేసిందేమీ లేదు. బాతులు కూడా తినడానికి ఇష్టపడని ధాన్యాన్ని నాడు కొనుగోలు చేశాం. నేడు కొంటామని చెప్పడం తప్ప చేసిందేమీ లేదు. నింగి-నేల-గాలి దోచేస్తున్నారు. చివరికి మన భూములు, ఆస్తులు మన పేరుతో ఉన్నాయో లేదో ప్రతి రోజూ ఆన్ లైన్ లో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

దేవాలయాలను దోచేస్తూ దేవుళ్లు కూడా భయపడే పరిస్థితి కల్పించారు. ఆదాయం సృష్టించడం చేతకాక పన్నులు పెంచి కాలం నెట్టుకొస్తున్నారు. మంచినీటి పన్ను, చెత్త పన్ను, సీవరేజి పన్ను అంటూ పెంచుకుంటూ పోతున్నారు. చివరికి మరుగుదొడ్ల వినియోగం, జుట్టు పెంపు, రోడ్లపై నడక, కూడా పన్ను వేస్తారేమో అనిపిస్తోంది. దొరికిన చోటల్లా దోచేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు. అధికార పార్టీ నేతల అక్రమాలకు మద్దతిచ్చి అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితికి వచ్చారు. 

చట్టాన్ని గౌరవిద్దాం. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని తీసుకుందాం. అమరజీవి చూపించిన సాహసం, చేసిన త్యాగం మనం గుర్తుంచుకోవాలి. అన్యాయం జరుగుతుంటే నాకు జరగలేదు.. ఎవరికో జరిగిందని పట్టించుకోకుంటే పొట్టి శ్రీరాములు ఆ త్యాగం చేసే వారు కాదు. మీ ఆవేదన, బాధ చూస్తుంటే సమాజంలో మనకు తెలియకుండా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో ఆలోచించాలి.

కొన్ని సంఘటనలు బయటకు చెప్పుకోవడానికి కూడా అవమానంగా ఉంటుంది. వైశ్యుల్లో సేవా భావం ఉంది. రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది. వారిని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆర్య వైశ్యులకు ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేల పదవులు ఇచ్చాం. కానీ పదవులు పొందిన కొందరు స్వార్థంతో బయటకు వెళ్లిపోయారు.

నాయకులను తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వైశ్యులకు న్యాయం జరగాలి. రాష్ట్రం కోసం అందరూ శ్రమించాల్సిన అవసరం ఉంది. అన్ని నియోజకవర్గాల్లో వైశ్యుల అభివృద్ధికి చేయాల్సినవన్నీ చేస్తాం. సామర్ధ్యం ఉన్నప్పుడు వెనక్కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు కూడా సామాజిక న్యాయం జరగాలి. జమిలి ఎన్నికలు వచ్చే లోపు మీలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేస్తా. 

జగన్ పాలనలో బతకలేకపోతున్నాం.. భరోసాగా నిలవండి :
కార్యక్రమానికి హాజరైన పలువురు వైశ్య సామాజికవర్గ ప్రజలు, కార్యకర్తలు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని, టీడీపీకి ఓటేశారనే కారణంతో భూములు, ఆస్తులు ఆక్రమించుకుంటున్నారు. ఈ రోజు ఇక్కడ మాట్లాడినందుకు కూడా రేపు కేసులు పెడతారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిని పోలీసులతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.