గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 13 మే 2017 (03:32 IST)

మోదీ అంతరంగం అంతుబట్టని చంద్రబాబు.. మోదీ-జగన్‌ భేటీతో కొండలా పెరిగిన అనుమానం.. ఢిల్లీలో రహస్య చర్చలు

తాను, బీజేపీలో తన ఆపద్బాంధవుడు వెంకయ్యనాయుడు దేశంలో లేని సమయం చూసుకుని పోతుటీగకు గూడా తెలీకుండా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను పిలిపించుకుని ఎవ్వరూ ఊహించనివిధంగా 45 నిమిషాల పాటు ప్రధాని నరేంద్రమోదీ రహస్య చర్చలు జరిపారని తెలియగానే చంద్రబాబులో శంక మొ

తన నీడను కూడా నమ్మని చంద్రబాబుకు ఢిల్లీ రాజకీయాల్లో ఏదో తేడా చోటుచేసుకుంటోందన్న అనుమానం మరింత బలపడినట్లుంది. తాను, బీజేపీలో తన ఆపద్బాంధవుడు వెంకయ్యనాయుడు దేశంలో లేని సమయం చూసుకుని పోతుటీగకు గూడా తెలీకుండా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను  పిలిపించుకుని ఎవ్వరూ ఊహించనివిధంగా 45 నిమిషాల పాటు ప్రధాని నరేంద్రమోదీ రహస్య చర్చలు జరిపారని తెలియగానే చంద్రబాబులో శంక మొదలైంది. ఢిల్లీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చంద్రబాబు అమరికానుంచి ఢిల్లీకి తిరిగిరాగానే శుక్రవారం సాయంత్రం ఆరుగంటలపాటు ఎవరికీ తెలీకుండా అదృశ్యమయ్యారన్న వార్త ఇప్పుడు పెను సంచలనంగా మారింది. 
 
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని గంటలపాటు ఎవరికీ అందుబాటులో లేకుండా అదృశ్యమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు బృందం షెడ్యూల్ ప్రకారం అక్కడి నుంచి నేరుగా విజయవాడ రావాల్సి వుంది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నట్టుగా 3.15కు ఒకసారి, ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ వెళుతున్నట్టు 3.55కు ఒకసారి మీడియాకు అధికార వర్గాల ద్వారా సమాచారం అందించారు. కానీ రాత్రి తొమ్మిది గంటల వరకూ సీఎం ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మీడియాను నమ్మించడం సంచలనం కలిగిస్తోంది.
 
తాజా సమాచారం ప్రకారం ఆయన రహస్యంగా ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ నగరం చేరుకుని కొందరు ప్రముఖులతో భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాత్రి 8.35 వరకు తన రహస్య మంతనాలు ముగించుకున్న ముఖ్యమంత్రి తిరిగి తొమ్మిది గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఢిల్లీలో ఎక్కడికెళ్లారు, ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. సాయంత్రానికే రాష్ట్రానికి చేరుకుంటారని షెడ్యూలులో ఉన్నా.. దాన్ని పక్కనపెట్టి అత్యవసరంగా, రహస్యంగా మంతనాలు జరపడం ఆసక్తి కలిగించింది. చంద్రబాబు రాత్రి 9.30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు.
 
ఎన్నడూ లేనిది వైకాపా అధినేత జగన్‌కు స్థానికి బీజేపీ నేతలు వత్తాసుగా నిలబడటం, మోదీ జగన్‌ని పిలిపించుకుని మాట్లాడితే ప్రశ్నించడానికి మీరెవరు అని బీజేపీ ఏపీ అసెంబ్లీ ప్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు టీడీపీ నేతలను ధిక్కార స్వరంతో మాట్లాడటం చూస్తుంటే భవిష్యత్తు రాజకీయ సమీకరణలలో బీజేపీ హైకమాండ్ వైస్ జగన్ పట్ల మొగ్గు చూపుతున్న విషయం స్పష్టమవుతోంది. టీడీపీ అధినేతలో కలవరపాటుకు ఇదే కారణం అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.