బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

నేడు హస్తినకు వెళ్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళుతున్నారు. జీ-20 సదస్సు వ్యూహాలు ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తిన పర్యటనకు వెళుతున్నారు. సోమవారం ఉదయం 8.45 గంటలకు ఇంటి నుంచి ఆయన బయలుదేరుతారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానంలో వెళ్లి మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకుంటారు. 
 
ఢిల్లీకి చేరిన తర్వాత 50 అశోక రోడ్డులోని నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌ కల్చలర్ హాలులో జరిగే ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు తిరిగి అశోక రోడ్డులో ఉన్న నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు.
 
అలాగే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీతో ఆయనకున్న వైరం కారణంగా ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు.