గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (20:20 IST)

నేను ఎంజీఆర్, ఎన్టీఆర్ తరహా వ్యక్తిని.. సీఎం జగన్

jagan
తనకు తాను పార్టీ పెట్టుకుని వచ్చిన వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని, తాను తొలి ఇద్దరు నేతల జాబితాకు చెందిన వ్యక్తినని ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పర్యటించారు. ఆయన జగనన్న శాశ్వత భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు. 
 
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తూ కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేసిన వాళ్లను చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికలపుడు మాయమాటలు చెప్పి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దని ఆయన కోరారు. 
 
తాను చంద్రబాబు నాయుడు తరహాలో దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదన్నారు. ఆ దేవుడుని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. వైకాపా ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకుని, మీకు మంచి జరిగితే మీ బిడ్డనైన తనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు. 
 
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వేను చేపడుతున్నామని జగన్ తెలిపారు. 17 వేలకు పైగా గ్రామాల్లో భూముల సర్వే చేస్తున్నామని చెప్పారు. తొలి దశలో 2 వేల గ్రామాల్ల భూ రికార్డులను ప్రక్షాళన జరిగిందన్నారు. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలను అందించామని తెలిపారు. 
 
వచ్చే యేడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సర్వే పూర్తవుతుందని చెప్పారు. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించామని, రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. పైగా, భూముల రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.