గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (11:48 IST)

థియేటర్లలో ఆడియన్స్‌ నిల్‌, సినిమా ఫంక్షన్‌ చేస్తే ఫుల్‌! దీని మర్మం ఏమిటీ?

audiones
audiones
రాజకీయ పార్టీ మీటింగ్‌లలో ఆయా పార్టీ నాయకులు కార్యకర్తలను పోగుచేసి తీసుకురావడం మామూలే. వచ్చినందుకు వారికి బీరుబాటిల్‌, బిర్యానీతోపాటు ఆకుపచ్చ నోటు కూడా ఇస్తుంటారు. ఇది రివాజు. గ్రామాలనుంచి పట్టణాల వరకు స్థాయి భేదంలో వుంటుంటాయి. మనవాడే మన కులంవాడే అంటే వాడికి రెండు పచ్చకాగితాలు పంచిపెడుతుంటారు. ఇప్పుడు అది సినిమారంగలోనూ పాకింది. పార్టీలో కార్యకర్తలను లీడ్‌ చేయడానికి ఓ చిన్నపాటి నాయకుడిని ఎరేంజ్‌ చేస్తుంటారు. కానీ సినిమా ఫంక్షన్లకు వచ్చేటప్పుడు మాత్రం ఈవెంట్‌ నిర్వాహకులదే బాధ్యత తీసుకుంటారు. ఒక్కోసారి ఆ సినిమా ప్రమోషన్‌ చూసేవారు కూడా తప్పనిసరి వేలు పెడుతుంటారు.
 
ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్‌కు జనాలు రాకపోవడం, చిన్న సినిమా అయితే రెండోరోజు బోర్డు మారిపోవడం జరుగుతుంది. కరోనా తర్వాత అంతగా ఛేంచ్‌ అయిన ఆడియన్స్‌ మరి సినిమా ఫంక్షన్లకు ఎందుకు తండోపతండాలుగా వస్తున్నారు? అసలు ఏం జరుగుతుందని సినీ పెద్దలుకూడా ఆలోచిస్తున్నారు. దీనివెనుక ఓ కథ దాగి వుందని తెలుస్తోంది. ఇటీవల ఏ సినిమా విడుదలకాబోతున్నా రిలీజ్‌కు ముందే వివిధ పట్టణాలు తిరుగుతూ, అక్కడ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులను టార్గెట్‌ చేస్తూ వారిని ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఇందుకు ముందుగానే కాలేజీ నిర్వాహకులను కలిసి వారికి అందుకు తుణమో పణమో ఇస్తుంటారు. కానీ వీటిని చాలా కాలేజీ యాజమాన్యం వ్యతిరేకిస్తుంది కూడా. 
 
ఇటీవలే బోడుప్పల్‌ దగ్గర నారెపల్లి, కూకట్‌పల్లిలోని రెండు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలను ఓ సినిమా ఈవెంట్‌ నిర్వాహకులు, ఓ పి.ఆర్‌.ఓ. వెళ్ళి కలిస్తే వారిని అటునుంచి అటే పంపించేసేశారు కూడా. ఇలాంటి ముక్కుమొహం తెలీని కాస్టింగ్‌కు మా కాలేజీ పేరు వాడుకోవడం ఇష్టంలేదని వారు మొహంమీదే చెప్పేశారు. ఆ రెండు కాలేజీల్లోనూ గతంలో దిల్‌రాజు ఓ సినిమా తీయడానికి వెళ్ళినా కూడా వద్దని ఆయన మేనేజర్‌కు చెప్పేశాడు. ఇలాంటి వాటివల్ల స్టూడెంట్స్‌ పై విపరీతమైన ప్రభావం, చదువుకు బ్రేక్‌ పడుతుందని వారు చెప్పడం కూడా జరిగింది. కాలేజీ పేరుమీద సినిమాలు తీస్తూ యూత్‌ను పక్కదోవపట్టించే సినిమాలు రావడం తమకు ఇష్టంలేదని చెప్పేశారు. ఆ తర్వాత మరో కాలేజీలో ఆ సినిమా తీశారు. దానివల్ల షూటింగ్‌ జరిగిన 15రోజులు కాలేజీలో క్లాస్‌లే సరిగ్గా జరగలేదు.
 
ఇక ఇవన్నీ తెలుసుకున్న ఈవెంట్‌ మేనేజర్లు ఆంధ్రలోని కొన్ని చిన్న కాలేజీలను, స్కూల్లను టార్గెట్‌ చేస్తూ సినిమా ప్రమోషన్‌కు ఉపయోగించుకుంటున్నారు. ఇందుకు నిర్మాతలనుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. సోషల్‌మీడియాలో ఒక టీమ్‌ను పెట్టి నడుపుతున్న ఈవెంట్‌ మేనేజర్లు ముక్కుమొహం తెలీని హీరో సినిమాకూడా స్టూడెంట్స్‌తో పూలవర్షం కురిపిస్తూ, జిందాబాద్‌లతో నీరాజం పలికిస్తూ ఆ హీరోల అభిమానులుగా చెప్పుకునేట్లు చేస్తున్నారు. దీంతో ఆ హీరోలు కూడా పర్సనల్‌గా ఎరేంజ్‌ చేసిన మేనేజర్లను చూసుకుంటున్నారు. 
 
ఇదంతా ఒక ఎత్తయితే సినిమా ఫంక్షన్లకు ఎలా జనాలును తోలుకొస్తున్నారో ఇటీవలే యాంకర్‌ సుమ ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్‌గా మాట్లాడి రక్తికట్టించింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా టీజర్‌ విడుదలప్పుడు ఆమె యాంకర్‌గా రావాలి. కానీ కాస్త ఆలస్యం కావడంతో మరో కొత్త అమ్మాయిని యాంకర్‌గా చేశారు. ఆమె ఆహుతులైన కాలేజీ స్టూడెంట్స్‌ను (ముందుగా పాస్‌లు ఇచ్చిన వారు) ఆ సినిమా హీరోను దర్శకుడిని పొగిడేలా యాంకర్‌ ఫీడ్‌ ఇచ్చింది. ఆ హీరో వీరాభిమాని, ఆయన తోపు.. అంటూ రకరకాలుగా స్పందించారు. సుమ రాగానే జిందాబాద్‌ అంటూ హాజరైన యూత్‌ కేకలు వేశారు. హా..హా.. మీ ఓటు నాకే.. అంటూ తనదైన శైలిలో సమాధానం చెబుతూనే, ఇక్కడకు వచ్చిన కార్యకర్తలకు నమస్కారం.. అంటూ మొదలు పెట్టింది. వచ్చినవారు, చూస్తున్నవారు కార్యకర్తలేకదా.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్‌ వేయడం విశేషం. ఎందుకంటే ఆమె ఆమధ్య జయమ్మ పంచాయితీ సినిమా చేసింది. ఏ ఊరు ప్రచారానికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టారు. కానీ థియేటర్‌కే జనాలు రాలేదు. అప్పుడు, ఈ సినిమాకూ కూడా ఈవెంట్‌, ప్రచారం చేసేది ఒక్కరే కావడం విశేషం.
 
ఇక, గతంలో ఇలాంటిది మరీ చిత్రంగా జరిగింది. స్టార్‌ హోటల్‌లో మలయాళ నటుడు దుల్కర్‌ సినిమాకు ఏకంగా ఫేక్‌ స్టూడెంట్స్‌ వచ్చి క్వశ్చన్‌ అండ్‌ ఆయన్సర్‌ సెషన్‌ పెట్టడం జరుగుతుంది. ఏఏ ప్రశ్నలు ఎవరెవెరిని అడగాలో ముందుగానే నిర్వాహకులు వారికి చెబుతారు. అంతా అయిపోయాక వారికి భోజనాలు, పచ్చనోటు ఇవ్వడం రివాజుగా మారింది. నిర్మాతకు మాత్రం ఇంతమంది జనాలు చూసి తన సినిమా ప్రమోషన్‌ పెద్దగా జరిగిందని కాలర్‌ ఎగరేస్తారు. ఇక ఆ తర్వాత సినిమా విడుదలకు కానీ అసలు విషయం తెలియదు. ఈలోగా మరో నిర్మాతపై ఈ నిర్వాహకులు కర్ఛీఫ్‌ వేస్తారు. ఇలా వీరివల్ల నిర్మాతలు మోసపోతున్నారంటూ ఫిలింనగర్‌లో వార్త ప్రబలంగా వినిపిస్తోంది. ఈ విషయమై ఛాంబర్‌ దృష్టికి కొందరు తీసుకెళితే పబ్లిసిటీ విషయం మా పరిధిలోనిది కాదంటూ చెప్పడం విశేషం. ఇదే కాదు ఫేక్‌ ప్రచారం పేరుతో సోషల్‌ మీడియాలో ఎలా హైలైట్‌ కావాలో కూడా కొందరు ప్రచారకర్తలు హింట్‌ ఇస్తుంటారు. అందులో భాగమే ఇటీవల జరిగిన విశ్వక్‌సేన ఓ సినిమా నుంచి తప్పుకోవడం. అసలు విషయం వేరు. కానీ పబ్లిసిటీ కోసం నిర్మాతను రాద్దాంతం చేశారు. చివరికి ఛాంబర్‌ కూడా నిర్మాతవైపు ఉండడంతో చేసేది ఏమీలేకుండా పోయింది. ఇలా చాలా విషయాలతో నిర్మాతలు తప్పటడుగువేస్తున్నారు. ఇందులో మీడియా కూడా భాగం కావడం శోచనీయం. ఫైనల్‌గా లబ్ది పొందింది ఎవరో మీకు చెప్పనవసరంలేదు కదా!