గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (10:40 IST)

తన కుమారుడిని ఐటీ అధికారులు చిత్రహింసలు పెట్టారు : మంత్రి మల్లారెడ్డి

malla reddy
తన కుమారుడిని ఐటీ అధికారులు వేధింపులకు గురిచేసి చిత్ర హింసలకు గురిచేశారని తెరాస నేత, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఛాతినొప్పి కారణంగా ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి బుధవారం ఆస్పత్రిలో చేరారు. ఈయన సూరారంలో ఉన్న ఒక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని చూసేందుకు మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చారు. 
 
అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐటీ అధికారులు తన కుమారుడిని తనిఖీల పేరుతో వేధించారని ఆరోపించారు. తన కొడుకుని ఐటీ అధికారులు కొట్టారని, అందుకే ఆయన ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు. రాత్రంతా సీఆర్పీఎఫ్ బలగాలు చిత్రహింసలకు గురిచేసి కొట్టారని తెలిపారు. 
 
తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదని కాలేజీలు స్థాపించి సేవ చేస్తున్నామని తెలిపారు. ఎన్నో యేళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. కష్టపడి సంపాదించి, నిజాయితీగా బతుకుతున్నామని చెప్పారు. 
 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపునకు ఉపయోగిస్తుందని ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే తమపై ఐటీ సోదాలు చేశారని, 200 మంది ఐటీ అధికారులు తమ గృహాలు, కార్యాలయాలపై సోదాలు చేశారన్నారు.