బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (10:59 IST)

మిస్టర్ తుగ్లక్... వడ్డీతో సహా వసూలు చేస్తాం : చంద్రబాబు

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నయా తుగ్లక్ అంటూ జగన్‌ను ఆయన అభివర్ణించారు. పైగా, తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా వసూలు చేస్తామని హెచ్చరించారు. రాజధానిని తరలించవద్దంటూ 49 రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నా సీఎం జగన్మోహన్ రెడ్డికి కనబడటం లేదా అని చంద్రబాబు నిలదీశారు. 
 
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అమరావతిని తరలిస్తారన్న దిగులుతో 37 మంది రైతులు చనిపోయారని, ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉన్నట్టయితే వారు చనిపోయే వారు కాదు అని అభిప్రాయపడ్డారు. ఇంకా ఎంతమంది చనిపోవాలి? ఎంత మందిని బలితీసుకుంటారు? అని ప్రశ్నించిన చంద్రబాబు, ఈ 37 మంది చనిపోవడాన్ని ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించారు. 
 
టీడీపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 'జగన్మోహన్ రెడ్డీ గుర్తుపెట్టుకో, మళ్లీ తొందరల్లోనే నీ రోల్ వస్తుంది' అని తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ సందర్భంగా చురకలు అంటించారు. న్యాయం, ధర్మం ఉన్నాయని వాటి కోసం తాము పోరాడుతున్నామని అన్నారు. 
 
ఐదు కోట్ల ప్రజలు, భావితరాల కోసమే తాము పోరాటం చేస్తున్నామని, వైసీపీ తప్ప పార్టీలన్నీ అమరావతే రాజధాని అంటున్నాయని అన్నారు. ఇంత దుర్మార్గమైన పాలనను దేశంలో ఎక్కడా చూడలేదని వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. చరిత్రలో తుగ్లక్ చనిపోయాడనుకుంటే, మళ్లీ మన రాష్ట్రంలో పుట్టాడని, అతనే నయా తగ్లక్ జగన్ అంటూ సెటైర్లు వేశారు.