శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Modified: గురువారం, 4 జులై 2019 (15:45 IST)

సామాన్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఇస్రో....

భారతీయ అంతరిక్ష సంస్థ (ఇస్రో) సామాన్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కల్పించింది. ఈ ఛాన్స్ కేవలం 10వేల మందికి మాత్రమే లభించనుంది. ఇవాల్టి నుండి ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లోనే అనుమతి అందించనుంది.
 
మామూలుగా రాకెట్‌ను ఆకాశంలోకి పంపే ప్రక్రియను మనం కేవలం టీవీలలో వీక్షించి ఉంటాం. ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేం. అలా ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోరికను ఇస్రో నెరవేరుస్తోంది. ఏకంగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కల్పించింది.
 
ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-2 ప్రయోగం ఈనెల 15వ తేదీన జరగనుంది. ఆ రోజు తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు GSLV-మార్క్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు 10 వేల మంది సామాన్యులకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి ఇవాళ అర్థరాత్రి నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 
 
చంద్రయాన్-2 ప్రయోగాన్ని లైవ్‌లో చూడాలనుకునేవారు ఇస్రో వెబ్‌సైట్ WWW.ISRO.GOV.INలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇస్తామని ఇస్రో సంస్థకు చెందిన ప్రతినిధులు వెల్లడించారు.