శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (10:04 IST)

చెన్నైలో ప్రేమోన్మాది... ప్రేమించలేదని యువతిపై కిరోసిన్‌ పోసి...

చెన్నైలో ఓ ప్రేమోన్మాది అతి కిరాతకంగా ప్రవర్తించాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించడంతో పాటు తానూ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగర శివారుల్లో జరిగింది. ఈ ఘటనలో త

చెన్నైలో ఓ ప్రేమోన్మాది అతి కిరాతకంగా ప్రవర్తించాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించడంతో పాటు తానూ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగర శివారుల్లో జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 
 
దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే... అంబత్తూరులోని పుదూర్‌ భానునగర్‌కు చెందిన పార్తీబన్‌ (21) అన్నానగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అదేదుకాణంలో పని చేస్తున్న అంబత్తూరు లెనిన్‌నగర్‌కు చెందిన మైథిలి (20)తో రెండున్నరేళ్లుగా స్నేహం చేస్తున్నాడు. ఆరు నెలల కిందట ఓ ప్రమాదంలో పార్తీబన్‌ కాలు విరగడంతో శస్త్రచికిత్స తర్వాత అతడు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. దీంతో మైథిలితో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. 
 
ఈ నేపథ్యంలో వారం కిందట మైథిలీని కలిసిన పార్తీబన్‌ ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో పాటు తన ప్రేమను అంగీకరించాలని అభ్యర్థించాడు. అతని వైఖరితో విస్మయానికి గురికావడంతో పాటు అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. దీంతో ప్రతీరోజూ ఆమెను కలిసి తనను ప్రేమించాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. శుక్రవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్సులో బయలుదేరిన మైథిలి రాత్రి 10.30 గంటలకు తిరుముల్లైవాయల్‌ బస్టాప్‌లో దిగింది. అక్కడి నుంచి ఇంటికి నడిచి వెళుతున్న ఆమెను వివేకానందర్‌ నగర్‌ వద్ద పార్తిబన్‌ అడ్డుకున్నాడు. 
 
తనను ప్రేమించకపోతే కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడతానని తన చేతిలోని కిరోసిన్‌ క్యాను చూపించి బెదిరించాడు. దీనిని లక్ష్యపెట్టకుండా మైథిలి ముందుకు వెళ్లడంతో ఆగ్రహించిన అతను ఆమెను అడ్డుకుని కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. తర్వాత తనపైనా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రాత్రిపూట జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆ ఇద్దరిని రక్షించి చెన్నై కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.