ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 జూన్ 2017 (17:29 IST)

హైదరాబాదులో చైనా ప్లాస్టిక్ బియ్యం.. అన్నం ముద్దను నేలకేసి కొడితే బంతిలా ఎగిరింది..!

హైదరాబాదులో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ఇప్పుడిప్పుడే దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ కోడిగుడ్లు బయటపడిన నేపథ్యంలో.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం బాగోతం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాదులో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ఇప్పుడిప్పుడే దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ కోడిగుడ్లు బయటపడిన నేపథ్యంలో.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్లాస్టిక్ బియ్యాన్ని వరిబియ్యం అంటూ అమ్మేస్తూ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్, శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు అందినట్లు ఆహార భద్రత అధికారులు తెలిపారు. పలుచోట్ల దాడులు చేస్తున్నామని.. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రైస్ బ‌స్తాల‌ను సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వ్యాపారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు వెల్లడించారు. 
 
తాజాగా హైదరాబాద్ మీర్ పేట్‌లో ప్లాస్టిక్ బియ్యం వినియోగంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు అప్రమత్తమై దాడులు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో అశోక్ అనే బాధితుడు ప్లాస్టిక్ బియ్యం వినియోగించినట్లు తెలిపాడు. రెండు నెలల పాటు ఇంట్లో ప్లాస్టిక్ బియ్యాన్నే వాడినట్లు చెప్పాడు. తాము తినే అన్నం ప్లాస్టిక్‌ బియ్యంతో తయారైందని ఆలస్యంగా గుర్తించినట్లు తెలిపాడు. ఈ ప్లాస్టిక్ బియ్యం అన్నం తిన్న తర్వాత ఇంట్లోని అందరికీ కడుపు ఉబ్బిపోతుందని.. ఆసుప‌త్రికి కూడా వెళ్లామ‌ని, ట్యాబ్లెట్లు వేసుకుంటే త‌గ్గుతోంది కానీ, మ‌ళ్లీ అనారోగ్యం ‌పాలు అవుతున్నామ‌ని చెప్పాడు.
 
ఇలా సోమవారం రాత్రి తెచ్చుకున్న బియ్యం కూడా లేటుగా ఉడికింది. అలాగే మెత్తగా ఉండటంతో పాటు అన్నం ముద్ద‌ను నేలకేసి కొడితే అది బంతిలా ఎగిరింద‌ని అశోక్ తెలిపాడు. అందుకే పోలీసులకు ప్లాస్టిక్ బియ్యంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. వ్యాపారులు డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని అశోక్ వాపోయాడు. ఈ బియ్యాన్ని హైదరాబాదులోని నాగోల్ సూపర్ మార్కెట్ అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.