1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:24 IST)

విగ్గుతో అమ్మాయిలను బురిడీ కొట్టించే ఎంసీఏ పట్టభద్రుడు!

ఎంసీఏ పూర్తి చేసిన ఓ పట్టభద్రుడు.. తనకున్న బట్టలకు ఆకర్షణీయమైన విగ్గులు పెట్టుకుంటూ అనేక మంది అమ్మాయిలను మోసం చేశాడు. చివరకు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో అతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్ అనే యువకుడు డిగ్రీ వరకు అద్దంకిలో చదివాడు. హైదరాబాద్‌లో ఎంసీఐ పూర్తి చేశాడు. ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్ చదివాడు. ఉన్నత చదువులు చదివిన ఈ వ్యక్తి కొన్ని రోజులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా చేశాడు. 
 
అయితే మొదటిసారి 2017 సంవత్సరంలో మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో తన ఫొటో పెట్టాడు. ఓ యువతిని పరిచయం చేసుకొని ఆన్‌లైన్ ఛాటింగ్ చేసి డబ్బులు గుంజాడు. ఇదేదో సులభంగా ఉండటంతో ఇక అప్పటి నుంచి ఉద్యోగం వదిలేసి ఇదే దందాను కొనసాగిస్తున్నాడు.
 
అయితే, చదువుకునే రోజుల్లోనే బట్టతల రావడంతో ఈ విషయాన్ని దాచిపెట్టి విగ్గు పెట్టుకొని ఫోటోలు దిగేవాడు. వాటిని మాట్రిమోనీ సైట్‌లలో అప్‌లోడ్ చేసేవాడు. పేర్లు మార్చుతూ మోసాలకు పాల్పడసాగాడు. ముఖ్యంగా అమాయక అమ్మాయిలే అతను లక్ష్యంగా ఎంచుకుని వారిని బురిడీ కొట్టించసాగాడు. 
 
అలాంటి అమ్మాయిలతో ఆన్‌లైన్ ఛాటింగ్ చేస్తూ వారికి మాయమాటలు చెప్పి తన బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేయించుకొనేవాడు. 2017లో ఒంగోలుకు చెందిన ఓ టెక్కీ వద్ద రూ.27 లక్షలు, 2018లో నరసరావుపేటకు చెందిన మరో టెక్కీ వద్ద రూ.40 లక్షలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినప్పటికీ అతని బుద్ధి మారలేదు. ఈ క్రమంలో బెంగళూరు సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నాలుగు కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతని వద్ద జరిపిన విచారణలో అసలు గుట్టు బహిర్గతమైంది. నిందితుడి నుంచి రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.