ఆఫ్ఘనిస్థాన్‌లో కో-ఎడ్యుకేషన్‌పై సర్వత్రా ఆందోళన
ఆఫ్ఘనిస్థాన్‌లో కో-ఎడ్యుకేషన్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. అమ్మాయిలకు బోధించేందుకు పురుషులకు అనుమతి లేదని తాలిబన్లు విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటించారు. దేశంలో విద్యా విధానం కూడా షరియా చట్టాలకు అనుగుణంగానే ఉంటుందని హక్కానీ స్పష్టం చేశారు. దేశంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని తెలిపారు. హక్కానీ నిన్ననే తాత్కాలిక విద్యాశాఖా మంత్రిగా నియమితులయ్యారు.
తాలిబన్ల తాజా నిర్ణయం కారణంగా అమ్మాయిలు ఉన్నత విద్యకు దూరమవుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా తరగతులు నిర్వహించేందుకు తగిన మానవ వనరులు అందుబాటులో లేకపోవడం, ఖర్చు తడిసి మోపెడు అయ్యే అవకాశం ఉండడంతో యూనివర్సిటీలు ఈ విషయంలో ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అమ్మాయిలకు ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం వుంది.