మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 7 అక్టోబరు 2021 (13:35 IST)

2,320 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా చేసిన వీఆర్వో!

వి.ఆర్.ఓ. అంటే, గ్రామంలో ఓ చిన్న రెవిన్యూ స‌హాయ‌కుడు. కానీ, అమాంతం భూముల్ని మింగేశాడీ రెవిన్యూ అధికారి. విఆర్ఓగా పని చేసిన వ్యక్తి భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డాడు. ఒకటీ రెండు కాదు... ఏకంగా 2,320 ఎకరాల ప్రభుత్వ భూమిని తన కూతురు, కొడుకుల పేర్లపై రాసుకున్నాడు. నకిలీ పత్రాలను సృష్టించి, సర్కారుకు టోకరా వేశాడు. చివ‌రికి దీనిని ఆన్‌లైన్‌ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కిం చేశాడు.
 
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జరిగిన సుమారు రూ.500 కోట్ల ఈ భారీ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు బట్టబయలు చేశారు. తిరుపతి సీఐడీ డీఎస్పీ గుమ్మడి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిని కాజేయడానికి 40 ఏళ్ళ  క్రితమే ప్లాన్ చేసి, దశల వారీగా ఈ వి.ఆర్.ఓ. అమలు చేసుకుంటూ వస్తున్నాడని సీఐడీ పోలీసులు ఎంక్వైరీలో తేలింద‌న్నారు.
 
 చిత్తూరు జిల్లాలోని యాదమరి మండలం 184 గొల్లపల్లెకు చెందిన మోహన్ గణేశ్ పిళ్లై 1977 నుంచి గ్రామ కరణంగా పని చేశాడు. కరణం వ్యవస్థ రద్ద‌య్యాక అక్కడే వీఏవోగా, వీఆర్వోగా పని చేసి, 2010లో రిటైర్ అయ్యాడు. ఈ క్రమంలో జిల్లాలోని సోమల, పుంగనూరు, పెద్ద పంజాని, బంగారు పాళెం, యాదమరి, చిత్తరూరు, కేవీపల్లె, గుర్రంకొండ, చంద్రగిరి, ఏర్పేడు, సత్యవేడు, రామచంద్రాపురం, తంబళ్లపల్లె మండలాల్లోని 18 గ్రామాల్లో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న 2,320 ఎకరాల భూమిని తన తండ్రి శ్రీనివాస పిళ్లైకు వారసత్వంగా వచ్చినట్లు, దానిని తన తల్లి అమృతవళ్లమ్మకు 1981లో బదలాయించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించాడు.
 
గణేశ్ పిళ్లై ఈ భూమి అమృతవళ్లమ్మ తన మనుమలు (గణేశ్ పిళ్లై పిల్లలు) ఎంజీ మధుసూదన్, ఎంజీ రాజన్, వి.కోమల, కె.ధరణిలకు చెందేలా వీలునామా తయారు చేశాడు. దీనిని 1985లో బంగారుపాళ్యం సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఒకే రోజున 1,577 ఎకరాలకు ఆన్‌లైన్ రికార్డ్స్ త‌యారైపోయాయి. ప్రభుత్వం భూ రికార్డులను ఆన్‌లైన్ చేయడం గణేశ్ పిళ్లై ఈ భారీ కుంభకోణానికి పాల్పడేందుకు బాగా కలిసొచ్చింది.
 
2005 నుంచి 2010 మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలోని భూములు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సమయంలో తన కుమారుడు ఎంజీ మధుసూదన్‌తో 2009 జులై 1న 59 సర్వే నంబర్లకు చెందిన 1,577 ఎకరాల ప్రభుత్వ భూమిని తన నలుగురు పిల్లల పేరుతో ఒక్క రోజులో ఆన్‌లైన్‌లోకి ఎక్కించాడు. ఆ తర్వాత మీ సేవ ద్వారా అడంగల్, 1బీ కాపీలు తీసుకుని, వాటికి ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కలిపి పది మందికి అమ్మేశాడు గణేశ్ పిళ్లై.
 
దొరకబట్టిన తహసీల్దార్. ఆ 1,577 ఎకరాలు పోనూ మిగిలిన భూమికి సంబంధించి పాసు పుస్తకాలు సృష్టించే ప్రాసెస్‌లో ఓ తహసీల్దార్‌కు అనుమానం రావడంతో గణేశ్ పిళ్లై మోసం బయటపడింది. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో సర్వే నంబర్ 459లోని 160.09 ఎకరాల భూమికి అడంగల్, 1బీ చూపించి పట్టాదారు పాస్‌ పుస్తకం కావాలంటూ గణేశ్ పిళ్లై కొడుకులు ఎంజీ రాజన్, ఎంజీ మధుసూదన్, కూతురు ధరణి అక్కడి తహసీల్దార్ ఆఫీసులో ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ సర్వే నంబరులో 45.42 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉండడంతో సోమల మండల తహసీల్దార్‌ శ్యాంప్రసాద్ రెడ్డికి అనుమానం వచ్చింది. దీంతో ఆయన ప్రాథమిక విచారణ చేసి, అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్లు గుర్తించారు. 
 
దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2020 మే 29న పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఈ కేసును దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. దీంతో సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేసి 2,320 ఎకరాల ప్రభుత్వ భూములను గణేశ్ పిళ్లై అక్రమంగా తన కుటుంబం పేరుతో రికార్డులు సృష్టించుకున్నట్లు గుర్తించారు. దీంతో గణేశ్ పిళ్లై, అతడి ముగ్గురు పిల్లలు, ఇందులో సహకరించిన అడవి రమణ అనే వ్యక్తిని అరెస్టు చేశామని డీఎస్పీ రవి కుమార్ చెప్పారు. అయితే గణేశ్ కూతురు ధరణి పరారీలో ఉందని, ఆమె కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు. నిందితుల నుంచి స్టాంపులు, 40 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.