గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 4 అక్టోబరు 2021 (12:15 IST)

శ్రీకాకుళం జిల్లాలో మొబైల్ వేక్సినేషన్ వాహనాలు అందుబాటులోకి

శ్రీకాకుళం జిల్లాలో మొబైల్ వేక్సినేషన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం  జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద మొబైల్ వేక్సినేషన్ వాహనాలను జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేర్ ఇండియా సహకారంతో జిల్లాకు రెండు మొబైల్ వేక్సినేషన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ వాహనాల్లో ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు వేక్సినేటర్లు పనిచేస్తారని  తెలిపారు. 
 
 టెక్కలిలోని జిల్లా ఆసుపత్రి, సీతంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం అధీనంలో ఈ రెండు వాహనాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ వాహనాల ద్వారా జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, హైరిస్క్ ప్రాంతాల్లో వేక్సినేషన్ పెద్దఎత్తున అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సంచార పరీక్షా కేంద్రాలు ఏ విధంగా పనిచేసాయో అదేవిధంగా ఇవి పనిచేస్తాయని చెప్పారు.దీని ద్వారా ప్రజలకు మరింత చేరువలో వేక్సినేషన్ కార్యక్రమం అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేసారు. తక్కువ వేక్సినేషన్ కవరేజ్ అయిన ప్రాంతాలలో మొబైల్ వేక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని వివరించారు. ఇప్పటివరకు మొదటి డోసు, రెండవ డోసు తీసుకోలేని వారితో పాటు 18 ఏళ్లు దాటిన వారందరికీ కోవిడ్ వేక్సినేషన్ వేయడం జరుగుతుందని చెప్పారు.
 
 మొబైల్ వాహనాల ద్వారా అందిస్తున్న వేక్సినేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె.సి.చంద్రనాయక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. కె.అప్పారావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.