మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (21:40 IST)

ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు.. కానీ నేను గోడకు అంటించా.. సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం ‘నవరత్నాలు-20 నెలల పాలన’పై ఓ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోను.. ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో వేసే నాయకులను నేను చూశా. కానీ, మన ప్రభుత్వం ప్రతిరోజూ మేనిఫెస్టో కళ్ల ముందు కనిపించేలా.. కర్తవ్యాన్ని గుర్తు చేసేలా గోడకు తగిలించాం అని చెప్పారు.
 
అంతేకాకుండా, తాను అధికారం చేపట్టేనాటికి రూ.60 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని.. వాటిలో దాదాపు రూ.21 వేల కోట్లు విద్యుత్‌ సంస్థలకు సంబంధించినవిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ తనకు వివరించారని సీఎం జగన్‌ తెలిపారు. గత ప్రభుత్వంలో గ్రామస్థాయిలో అవినీతి జరిగిందని, కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతోనూ సఖ్యత లేదన్నారు. 
 
అలాగే, ఇప్పటివరకు గడిచిన పాలన ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయే పాలన మరో ఎత్తు అని చెప్పారు. ఈ 20 నెలల పాలనలో అధికారులందరూ సమష్టిగా కృషి చేశారని, అయితే, వచ్చే రోజులు మరింత ప్రాధాన్యమైనవని విశ్రాంతికి అవకాశం లేకుండా అందరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 
 
పరిపాలనలో ఇరవై నెలలు అంటే దాదాపు మూడో వంతు సమయం గడచిపోయింది. అంటే మిడిల్‌ ఓవర్లలోకి వచ్చాం. కాబట్టి ఇప్పుడు విశ్రాంతికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ అదే జరిగితే మనం వెనుకబడిపోకతప్పదు. ఇప్పుడు మనమంతా దృష్టిని తిరిగి కేంద్రీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏం చేశాం? ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్ని శాఖల మధ్య సమన్వయం ఉందా? వంటి విషయాలపై దృష్టి పెట్టాలి. ఆ మేరకు అన్నింటినీ సరిచూసుకోవాలి. సహజంగా ఈ సమయంలో అందరూ బ్రేక్‌ తీసుకుంటారు. అది జరగకూడదు. అప్పుడే మరింత ముందుకు వెళ్లగలుగుతాం. నో రిలాక్స్‌ అని అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం జగన్ అన్నారు.