విశాఖలో డ్రైవ్ ఇన్ థియేటర్: కారులో కూర్చుని స్నాక్స్ తింటూ హాయిగా సినిమా చూడొచ్చు!
డ్రైవ్ ఇన్ థియేటర్‌గా పేరుపొందిన బహిరంగ సినీ వేదిక త్వరలో విశాఖనగరం సొంతం కానుంది. కారు దిగకుండా, కాలు కింద పెట్టకుండా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే అవకాశం విశాఖ ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది. కుటుంబంతో పాటు కార్లోనే కూర్చుని హాయిగా సినిమా చూడొచ్చు. తినడానికి ఏం కావాలన్నా కారు దగ్గరకే వస్తాయి.
ముంబై, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి నాలుగు నగరాల్లోనే ఇలాంటి థియేటర్లు ఉన్నాయి. ఇలాంటి థియేటర్ ప్రస్తుతం ఏపీకి రానుంది. విదేశీ పరిజ్ఞానంతో విశాఖ ఎయిర్‌పోర్టుకు సమీపంలో షీలానగర్ వద్ద ఎస్టీబీఎల్ సినీ వరల్డ్ ఈ డ్రైవ్ ఇన్ థియేటర్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలో ఇది ఆవిష్కృతం కానుంది.
విశాఖను స్మార్ట్ సిటీగా చేసే ప్రక్రియలో భాగంగా.. విశాఖలో గత జనవరి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల్లో పూర్తయిన తొలి ప్రాజెక్ట్ డ్రైవ్ ఇన్ థియేటర్ కావడం గమనార్హం.
ఇక ఈ థియేటర్‌ను ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. 100 కార్లు పట్టేలా ఈ థియేటర్ ఉంటుంది.
* 90 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో స్క్రీన్ ఉంటుంది.
* ఇక్కడే రెస్టారెంట్ సౌకర్యం ఉంటుంది.
* ముందుగా వచ్చే పిల్లలు ఉచితంగా ఆడుకునేందుకు రూ. 80 లక్షల్లో క్రీడా పరికరాలు ఉంటాయి.
* ప్రతిరోజూ ఫస్ట్ షో, సెకండ్ షో ప్రదర్శిస్తారు. తెరపై బొమ్మ కనిపించినా.. కారులోని ఎఫ్ఎమ్ ద్వారా మాటలు, పాటలు వినిపిస్తాయి.