1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (16:01 IST)

బిడ్డ ప్రాణాలు కాపాడలేదు.. కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వని ప్రభుత్వాసుపత్రి వైద్యులు

deadbody on scooty
దేశంలోని ప్రభుత్వాసుపత్రుల దుస్థితి మరింత దయనీయంగా మారుతుంది. మనషుల ప్రాణాలు కాపాడాలేని ఈ ఆస్పత్రులు చివరకు ఆస్పత్రుల్లో చనిపోయిన మృతదేహాలను కూడా తరలించేందుకు కూడా అంబులెన్స్‌లను సమకూర్చలేని దయనీయమైన స్థితిలో ఉన్నాయి. 
 
తాజాగా ప్రభుత్వ ఆస్పత్రిలో చంటి బిడ్డను కోల్పోయిన ఓ తల్లి... బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను సమకూర్చాలని ఆస్పత్రి వైద్యుల కాళ్ళావేళ్లాపడి ప్రార్థించారు. వారు మాత్రం కనికరించలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి స్కూటీపైనే 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న  గ్రామానికి బిడ్డ మృతదేహంతో వెళ్లింది. ఈ హృదయ విదాకర ఘటన ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. 
 
విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో మృత్యువాతపడిన బిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని వైద్యులను తల్లిదండ్రులు ఎంతగానో ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. దీంతో బిడ్డ మృతదేహాన్ని చేతుల్లో పెట్టుకుని స్కూటీపై 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకి ఆ దంపతులు పుట్టెడు దుఃఖంలో ప్రయాణించారు. కేజీహెచ్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయామని ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.