శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:27 IST)

కోవిడ్-19: కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

దేశ వ్యాప్తంగా కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 47లక్షల మందికి పైగా కోవిడ్ బారినపడ్డారు.  37లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకోగా మరో 9.50లక్షల ఆక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య వెల్లడించింది.
 
ఈ నేపథ్యంలో కోవిడ్ బారినపడి కోలుకుంటున్న వారు కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కొవిడ్-19‌ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు ఒంటి నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు కనపడతాయని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (EMR డివిజన్) కోవిడ్ బారినుంచి కోలుకున్నవారు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అవసరమైన సూచనలు చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
కోవిడ్ బారినుంచి కోలుకున్న తర్వాత పాటించాల్సిన ప్రొటోకాల్:
(i) వ్యక్తిగతంగా:
* కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా మాస్కు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శ్వాసకోస జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
 
* తగినంత మేరకు వేడి నీళ్లు తాగుతూ ఉండాలి  
 
* రోగనిరోధ శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించిన మందులను వాడండి. ఆయుష్ డాక్టర్ ఇచ్చిన మందులు మాత్రమే ఉపయోగించండి.
 
* మీ ఆరోగ్యం సహకరిస్తే ఇంట్లో రోజువారీ పనులను చేసుకోండి. వృత్తిపరమైన పనులను కూడా క్రమపద్దతిలో ప్రారంభించవచ్చు. 
 
ii) తేలికపాటి/ మితమైన వ్యాయామాలు:
 
* శరీరం సహకరించిన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగాసనాలను వేయడం, ప్రాణాయామం చేయడం వంటి చర్యలను రోజూ చేయాల్సి ఉంటుంది.
 
* చికిత్స చేసే వైద్యులు సూచించిన విధంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి.
 
* మీకు సౌకర్యంగా ఉండే చోట ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడవడం అలవాటు చేసుకోండి.
 
*  సమతుల్యమైన పోషకాహారం, తాజాగా వండిన, సులువుగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
 
* తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవాలి.
 
* పొగతాగడం, మద్యం సేవించడాన్ని మానేయండి.
 
* కోవిడ్ చికిత్స సమయంలో సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఒకవేళ ఏమైనా శ్వాసకోస సంబంధమైన ఇబ్బందులు ఉంటే వెంటనే మీకు తెలిసిన వైద్యులను సంప్రదించాలి. వ్యక్తిగతంగా ఏమైనా మందులు వాడుతున్నట్టయితే వైద్యులకు తెలియజేయాలి. వారు సూచించిన మందులను వాడాలి.
 
* ఇంట్లోనే ఉంటూ శరీర ఉష్ణోగ్రతను తరచూ పరీక్షించుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆక్సోమీటర్ తో ఆక్సిజన్ లెవల్స్ ను తెలసుకుంటూ ఉండాలి. 
 
* పొడి దగ్గు / గొంతు నొప్పి ఉంటే, సెలైన్ గార్గల్స్ లేదా ఆవిరి పట్టడం చేసుకోండి.  
 
* కోవిడ్ ముందస్తు లక్షణాలైన తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ లెవెల్స్ 95శాతం కంటే తక్కువగా ఉండడం, ఛాతిలో నొప్పి, శరీరం బలహీనంగా మారడం, గందరగోళ పరిస్థితులు వంటివి
 
ii) కమ్యునిటీ స్థాయిలో:
* కోవిడ్ నుంచి కోలుకున్నవారు ఆ సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా గానీ, సంఘాలని గానీ, నాయకుల ద్వారా గానీ, కుల సంఘాల పెద్దల ద్వారా తమ స్నేహితులు, బంధువులతో పంచుకోవడం ద్వారా కోవిడ్ పై అవగాహన, వైరస్ పై ఉన్న వదంతులు తొలగించవచ్చు.
 
* స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, పౌరసమాజం, పలువురు నిపుణులతో పునరావాస చర్యలు చేపట్టండి (వైద్య, సామాజిక, వృత్తిపరమైన, జీవనోపాధి)
 
* సహచరులు, ఆరోగ్య కార్యకర్తల నుంచి సామాజిక మద్దతు కోరండి. అవసరమైతే మానసిక ఆరోగ్యసాయం తీసుకోండి.
 
* పలు సంస్థలు, గ్రూపులు నిర్వహించే యోగా, ధ్యానం లాంటి సమూహ సమావేశాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనండి. 
 
(iii) ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం:
 
* కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తికి భౌతికంగాను లేదా ఫోన్ ద్వారా 7 రోజుల్లోపు సంప్రదించాలి. వీలైనంత వరకు అతను చికిత్స పొందిన ఆస్పత్రిలో అయితే మంచిది.
 
* దగ్గరలో ఉన్న గుర్తింపు పొందిన అల్లోపతి లేదా ఆయుష్ ప్రాక్టీషనర్, మెడికల్ ఫెసిలిటీలు ఉన్న వారు తరచూ వారిని పరీక్షించడం, ఫాలో అప్ చేస్తూ ఉండాలి. పాలిథెరపీని వీలైనంత వరకు నివారించాలి.
 
* ఒకవేళ హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నవారైతే ఏవైనా కోవిడ్ లక్షణాలున్నట్టు గుర్తిస్తే వెంటనే వైద్యులకు గానీ, స్థానికంగా ఉండే ఆస్పత్రికి గానీ వెళ్లాలి. 
 
* క్లిష్టమైన, తీవ్రమైన కేసులకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకుంటూ సరైన విధంగా ఫాలోఅప్  పొందండి
 
రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మందులను (నిర్ధిష్ట స్ట్రీమ్ కింద గుర్తింపు పొందిన ప్రాక్టీషనర్స్ సూచించినవి మాత్రమే) 
 
* ఆయుష్ క్వాత్ (150 మిల్లీలీటర్లు లేదా ఒక కప్పు) ప్రతిరోజు తీసుకోవాలి.
 
* 500 మిల్లీ గ్రాముల శంషామని వటీ లేదా మూడు గ్రాముల గిలోయ్ పౌడర్‌ ను 15 రోజులపాటు వేడినీటిలో రోజూ రెండుపూటలు తీసుకోవాలి.
 
* అశ్వగంధ 500 మిల్లి గ్రాములు రోజుకు రెండుసార్లు ( ఒక గ్రాము చొప్పున ప్రతి రోజూ) తీసుకోవాలి. లేదా అశ్వగంధ పౌడర్ 1-3 గ్రాములు రెండుసార్లు ప్రతిరోజు అలా 15 రోజులు వాడాలి.
 
* రోజుకు ఒకసారైనా ఒక ఊసిరికాయ లేదా 1-3 గ్రాముల మేర ఊసిరికాయ పౌడర్‌ను తీసుకోవాలి. 
 
* పొడి దగ్గు ఉన్నట్టయితే ములేతి పౌడర్‌ ను 1-3 గ్రాముల మేర వేడినీటిలో కలిపి తీసుకోవాలి. 
 
* వేడి నీటిలో అర టీస్పూన్ పసుపు వేసుకుని ఉదయం, సాయంత్రం తాగాలి.
 
* పసుపు మరియు ఉప్పుతో పుక్కిలించాలి.
 
* ఒక టీ స్పూన్ చ్యవన్‌ప్రాశ్‌ ను ప్రతిరోజూ ఉదయం తినాలని సూచించింది. 
 
* అంతేకాకుండా ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఒక టీస్పూన్ చ్యవన్‌ప్రాశ్‌ ను ఉదయం వేడి నీటిలో లేదా పాలతో తాగవచ్చని సిఫార్సు చేసింది. 
 
చ్యవన్‌ప్రాశ్‌ అనేది కోవిడ్ నుంచి రికవరీ అనంతర కాలంలో ప్రభావవంతంగా ఉంటుందని గుర్తించారు.
 
కోవిడ్  నుండి కోలుకున్నా కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం వారు సూచిస్తున్నారు .