108 అంబులెన్సును తగులబెట్టిన రౌడీ షీటర్
108 అంబులెన్సును ఓ రౌడీ షీటర్ తగులబెట్టాడు. ఈ సంఘటన బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. సురేష్ అనే రౌడీ షీటర్ గత కొన్ని రోజులుగా 108 అంబులెన్సుకి రాంగ్ కాల్స్ చేస్తున్నాడు.
దీంతో చిర్రెత్తిన 108 సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో సురేష్ వీరంగం సృష్టించాడు. పోలీస్ స్టేషన్ అద్దాలు పగలగొట్టాడు. ఈ క్రమంలో సురేష్ చేతికి గాయాలు అయ్యాయి.
అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు 108 అంబులెన్సు రప్పించారు. 108 వాహనం ఎక్కిన సురేష్ వెంటనే వాహనం అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న స్పిరిట్‌తో అంబులెన్స్‌ను తగులబెట్టాడు. అతడు అంబులెన్సులోనే ఉండిపోయాడు. బయటకు రమ్మన్ని పోలీసులు హెచ్చరించినా వినలేదు. పోలీసులు చాకచక్యంగా అతడిని బయటకు లాగారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే అంబులెన్స్ కాలిపోయింది. తరువాత సురేష్‌ను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని కరనా వైరస్ వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.