రోజూ బట్టల షాపుకు వస్తున్న ఆవు.. వ్యాపారం భలేగుంది..
బట్టల షాపుకు మనమంతా వెళ్తుంటాం. కానీ ఓ ఆవు కూడా బట్టల షాపుకు వెళ్తుందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఓ ఆవు ప్రతిరోజూ బట్టల షాపుకు వస్తోంది. ఒక్క రోజు కూడా మిస్ కాదు. రోజూ ఆ షాపుకు రావడం ఫ్యాన్ కింద సేద తీరడం చేస్తుంది. ఈ ఘటన కడప జిల్లాలోని మైదుకూరులో జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. మైదుకూరులో ఓబయ్య అనే వ్యాపారికి బట్టల షాపు ఉంది. ఆ షాపు పేరు సాయి రామ్ క్లాత్ షోరూమ్. నిత్యం కష్టమర్లతో ఎంతో రష్‌గా వుండే ఆ షోరూమ్‌కు ఓ ఆవు ప్రతిరోజూ వస్తుంది. కష్టమర్ల కోసం వేసిన మెత్తని పరుపు మీద పడుకుని చక్కగా ఫ్యాన్ కింద సేదదీరుతోంది.
ఏడు నెలల పాటు ఈ తంతు జరుదుతోంది. కొత్తలో షాపులోకి వస్తున్న ఆవుని షాపు సిబ్బంది అడ్డుకున్నారు. అయినా అది ఆగకుండా వారిని నెట్టుకుని చక్కగా ఫ్యాన్ కింద తిష్ట వేసింది. దాన్ని కొట్టి బైటకు తోలేందుకు వారు యత్నించినా అది మాత్రం కదలకుండా అలాగే పడుకుంటోంది.
దీంతో షాపు యజమాని ఓబయ్య కూడా ఆవుని కొట్టి బైటకు తోలేందుకు యత్నించాడు. కానీ దెబ్బలు తింది కానీ కదల్లేదు. దీంతో ఓబయ్య తన వ్యాపారం దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందాడు. కానీ రోజు షాపుకు వస్తున్న ఆవుని చూసేందుకు కష్టమర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ ఆవు వల్ల తనకు వ్యాపారం బాగా కలిసి వచ్చిందనీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.