శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:04 IST)

ఇంకుడుగుంతలు ఉంటేనే కొత్త గృహాలకు ప్లాన్ ఇవ్వండి : హైకోర్టు

ఇంకుడుగుంతల నిర్మాణ అనుమతులపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా నానాటికీ అడుగంటిపోతున్న భూగర్భ జలాలను వృద్ధి చేసేందుకు ఇంకుడుగుంతలు ఏర్పాటు చేస్తేనే నూతన గృహాలకు అనుమతి (ప్లాన్‌) మంజూరు చేయాలని, నిర్మాణదశలోనూ పర్యవేక్షించాలని, చివరగా ఇంకుడుగుంత ఉంటేనే అక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి భోసాలే, జస్టిస్‌ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్, హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించింది. 
 
ఇందుకుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. నివాస గృహాలకే పరిమితం కాకుండా వాణిజ్య సముదాయాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకుడుగుంతలు ఏర్పాటుపై జారీ చేసిన జీవో అమలుకు తీసుకుంటున్న చర్యలేమిటో తెలపాలని కోరింది. ఇంకుడు గుంతలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని, ఇందుకోసం కరపత్రాలు ముద్రించడంతో పాటు, విరివిగా ప్రసార, సామాజిక మాథ్యమాన్ని వినియోగించాలని సూచించింది. 
 
భాగ్యనగరంలో ఇంకుడుగుంతలు ఏర్పాటును తప్పనిసరి చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 350ని అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎస్‌.వైదేహిరెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారించి పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.