సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (11:16 IST)

ధర్మానికి 'ధర్మాన' అతీతుడేంకాదు.. ఆయన్నూ విచారించాల్సిందే..

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిక్కుల్లోపడ్డారు. వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై విచారణలో ఉన్న అక్రమాస్తుల కేసుల్లో భాగమైన వాన్‌పిక్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈయన రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలోనే వాన్‌పిక్ భూముల కొనుగోలులో భారీ అవినీతి చోటుచేసుకుంది. ఈ కేసులో పలువురు రాజకీయ పెద్దలతో పాటు.. ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా జైలుపాలయ్యారు. ఆ తర్వాత వారంతా బెయిలుపై విడుదలై వున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు వైకాపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన పదవిలో లేనందున ఈ కేసుల విచారణ నుంచి విముక్తి కల్పించారనే ప్రచారం సాగింది. అయితే, సుప్రీంకోర్టు మాత్రం అందుకు ససేమిరాఅంది. పదవిలో లేకపోయినా అవినీతి నిరోధక చట్టం కింద ధర్మాన ప్రసాదరావును విచారించాల్సిందేనని సీబీఐ తరపు న్యాయవాది అంటున్నారు. గతంలో  సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిందని ఆయన గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద ధర్మాన ప్రసాద రావు కూడా త్వరలోనే సీబీఐ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.