సోమవారం, 16 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (11:34 IST)

వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని ఆందోళన చెందక్కర్లేదు : కేంద్ర మంత్రి కుమారస్వామి

kumaraswamy
ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సినపనిలేదని కేంద్ర మంత్రి కుమార స్వామి హామీ ఇచ్చారు. విశాఖ ప్లాంట్‌ను రక్షించడం తమ బాధ్యత అని ఆయ స్పష్టం చేశారు.
 
వైజాగ్ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం అంతకుముందు ఆయన ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కూటమి నేతలతో కలిసి విశాఖ స్టీలుప్లాంటును సందర్శించారు. ప్లాంట్‌లోని వివిధ భాగాలను పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు. కాకపోతే ఈ  విషయం వెల్లడించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి కావాలి. ముందు ప్రధానితో మాట్లాడి ఒప్పించాల్సి ఉంది. అందుకోసం మేము విస్తృతంగా చర్చించాం. 
 
ప్లాంటును దారికి తెచ్చేందుకు సమగ్ర నివేదిక రూపొందించి ప్రధాని ముందు ఉంచుతాం.. అయినా ప్రైవేటీకరణ చేస్తామని, అమ్ముతామని ఎవరు చెప్పారు' అని ఆయన ప్రశ్నించారు. 
 
'విశాఖ స్టీలుప్లాంటు మూసివేతపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎన్ఎల్) కుటుంబ సభ్యులెవరూ ఎలాంటి భయాలూ పెట్టుకోవాల్సిన పనిలేదు. 
 
ప్రధాని మోడీ ఆశీస్సులతో నెలన్నరలో ప్లాంటు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుంది' అని కేంద్రమంత్రి హెచ్ఐ కుమారస్వామి కార్మిక, ఉద్యోగసంఘాల నేతలకు భరోసా ఇచ్చారు. ఉక్కు కర్మాగారం ఉత్పాదన తీరును సీఎండీ అతుల్భట్ వారికి వివరించారు. ఈడీ వర్క్స్ భవనంలోని మోడల్ గదిలోని గ్యాలరీలో ఉంచిన అవార్డులను పరిశీలించి సిబ్బందిని అభినందించారు.