శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:39 IST)

16 ఏళ్ల తర్వాత గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు

16 ఏళ్ల తర్వాత గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా జీఎంసీ పరిధిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారపక్షమైన వైసీపీ సత్తా చాటుకొని తొలిసారిగా జీఎంసీలో మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలని వ్యూహరచన చేస్తోంది.

జీఎంసీ పరిధిలోని రెండు నియోజకవర్గాలైన తూర్పు, పశ్చిమలో తమదే పెత్తనం అని.. అది కలిసొచ్చే అంశం అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ తరపున మేయర్‌ అభ్యర్థి ఏవరన్నది స్పష్టత  లేదు. అయినా సీనియర్లు పాదర్తి రమేష్‌గాంధీ, కావటి మనోహర్‌నాయుడు రేసులో ఉన్నారు.

ఇప్పటికే కార్పొరేట్‌ అభ్యర్థులను ప్రకటించటంతో వారు మంగళవారం ప్రచారం చేపట్టారు. నగరంలో పట్టున్న నేతలు ఉండటంతో తమ గెలుపు ఖాయమంటూ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో డివిజన్లలో అభ్యర్థుల గెలుపు భారం ఎమ్మెల్యే ముస్తఫా తన భుజస్కంధాలపై వేసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అలానే చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు పశ్చిమలో కీలకంగా మారారు. మరోవైపు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ఆయన స్వయంగా ప్రచారంలో పాల్గొనటంతో పాటు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.

జగన్‌ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయంటూ వైసీపీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. గుంటూరు నగరపాలక సంస్థపై పచ్చజెండా ఏగురవేసి పట్టు పెంచుకోవాలని టీడీపీ తమ్ముళ్లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నగరపాలక సంస్థలో రెండుసార్లు తమ పాలనను గుర్తుచేసుకోవాలంటూ ప్రచార శంఖం పూరించారు.

టీడీపీ హాయాంలో గుంటూరు తూర్పు, పశ్చిమలో ట్రెడ్‌ మార్కులుగా చేసిన పనులతో పాటు పొన్నూరు రోడ్డు విస్తరణ, లాంచస్టర్‌ రోడ్డు రాకపోకలు అనువుగా తీర్చిదిద్దటం, బీఆర్‌ స్టేడియం, బస్టాండ్‌ పరిసర ప్రాంతాలలో రోడ్ల విస్తరణ, కొల్లి శారదా మార్కెట్‌, మానస సరోవరం, ఎన్టీఆర్‌ స్టేడియం ఇటువంటి శ్వాశ్వత పనులు తమ హాయంలో జరిగాయంటూ ప్రచారం మొదలు పెట్టారు.