తమ్ముడు కనిపించలేదని పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన చిన్నారులు... షాక్ అయిన ఖాకీలు..
ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న దంపతులు తమకు మూడో బిడ్డగా పుట్టిన మగబిడ్డను విధిలేని పరిస్థితుల్లో ఇద్దరు మహిళలకు అప్పజెప్పారు. అలా ఆస్పత్రిలో పుట్టిన మగబిడ్డను ఇచ్చిన మాట ప్రకారం ఆ తండ్రి తీ
ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న దంపతులు తమకు మూడో బిడ్డగా పుట్టిన మగబిడ్డను విధిలేని పరిస్థితుల్లో ఇద్దరు మహిళలకు అప్పజెప్పారు. అలా ఆస్పత్రిలో పుట్టిన మగబిడ్డను ఇచ్చిన మాట ప్రకారం ఆ తండ్రి తీసుకువెళ్ళి అప్పగించేశాడు. తమకు తమ్ముడు పుట్టాడని సంతోషపడిన ఇద్దరు పిల్లలకు తమ్ముడు కనిపించలేదు. అమ్మను అడిగితే కన్నీళ్లే సమాధానంగా వచ్చింది.
చివరకు తన బిడ్డను ఇచ్చేయమని ఆ తల్లి ఆ మహిళలను ప్రాధేయపడింది. వారు ససేమిరా అనడంతో పురిటి మంచంపై లేవలేక తన ఇద్దరు పిల్లలను పోలీస్‌స్టేషన్‌కు పంపించింది. వారిద్దరూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ తమ్ముడిని అప్పగించాలనడంతో పోలీసులు బిత్తరపోయారు.
వివరాల్లోకి వెళితే.. పెదవేగి మండలం భోగాపురం గ్రామానికి చెందిన కోలా సుబ్బారావు, రాధిక దంపతులకు పద్మిని(10) అనే కుమార్తె, బన్ను (8) అనే కుమారుడు ఉన్నారు. పద్మిని 4వ తరగతి చదువుతుండగా, బన్ను3వ తరగతి చదువుతున్నాడు. సుబ్బారావు ఆటోడ్రైవరుగా జీవిస్తున్నాడు. రాధిక తిరిగి గర్భందాల్చడంతో అదే ప్రాంతానికి చెందిన మహిళలు విజయ, వీరమామ్మ కలిసి సుబ్బారావు, రాధికలను సంప్రదించారు.
పుట్టే బిడ్డను తమకు ఇస్తే సంతానంలేని ధనవంతులు శాంతినగర్ 12వ రోడ్డులో ఉన్నారని, వారు డబ్బులు కూడా ఇస్తారని చెప్పారు. అప్పటికే కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. ఈ క్రమంలో ఈ నెల 25న రాధిక ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒప్పందం ప్రకారం విజయ, వీరమామ్మ కలిసి ఆ బిడ్డను సుబ్బారావు సహకారంతో తీసుకువెళ్ళిపోయారు.
ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లగానే రాధికను తమ్ముడు ఎక్కడా అని ఆమె పిల్లలు అడిగినా సమాధానం చెప్పలేకపోయింది. పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో తన ఇద్దరు పిల్లలను 50 రూపాయలు ఆటోచార్జీలు ఇచ్చి నేరుగా టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు పంపించింది. ఇక ఆ ఇద్దరు పిల్లలు పోలీసు స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులు షాక్ తిన్నారు. పిల్లలు తమ్ముడు కనిపించట్లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.