గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (08:41 IST)

ఏలూరు పట్టణంలో వింత వ్యాధికి అసలు కారణమిదే...

వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో వెలుగు చూసిన వింత వ్యాధికి అసలు కారణాన్ని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు చెందిన వైద్య నిపుణులు గుర్తించారు. ఈ ప్రాంత ప్రజలు తాగే నీటిలో మోతాదుకు మించి రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా, నికెల్, లెడ్ (సీసం) ఉన్నాయని అందువల్లే ఈ వింత వ్యాధి వచ్చిందని తేల్చారు. 
 
బాధితుల రక్త నమూనాలను సేకరించిన వైద్య బృందాలు, వారి రక్తంలో సీసంతో పాటు, నికెల్ తదితర లోహాల అవశేషాలు పరిమితికి మించి వున్నాయని వెల్లడించారు. ఇది కలుషిత నీరు తాగిన కారణంగానే అయ్యుండవచ్చని, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి ఎంతమాత్రమూ కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
 
కాగా, గత శనివారం నుంచి ఏలూరు పట్టణంలోని దక్షిణ వీధికి చెందిన అనేకమందికి ఉన్నట్టుండి వాతులు, విరేచనాలతోపాటు.. మూర్ఛ వచ్చి పడిపోయారు. అలా రెండు రోజుల్లోనే ఈ సంఖ్య 350కు చేరింది. వెంటనే అప్రమత్తమై ప్రభుత్వ అధికారులు అనారోగ్యంబారినపడిన వారందరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ వింత వ్యాధిపై ఆరా తీసినప్పటికీ వారికి సరైన ఆధారం లభించలేదు. 
 
ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందించి, ఏలూరుకు ఎయిమ్స్‌ వైద్య నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని పంపించింది. ఈ బృందం బాధితుల నుంచి నమూనాలు సేకరించిన వాటిని ఇతర రాష్ట్రాల్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేంద్రాలు, వైరాలజీ ల్యాబ్లకు పంపించింది. 
 
ఈ పరీక్షా ఫలితాల్లో రక్తంలో మోతాదుకు మించి లెడ్, నికెల్ లోహాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఇలా ఎందుకు, ఎలా చేరుంటాయనడానికి మాత్రం ఇంకా సమాధానం లభించలేదు. ఏలూరులో గత వారం రోజులుగా ప్రజలు వాడిన నీరు, పాలు, ఆహార పదార్థాల శాంపిల్స్ ను కూడా సేకరించిన అధికారులు, అన్నింటినీ పరిశీలిస్తున్నారు.
 
కలుషిత ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్లే ఈ వ్యాధికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నా, అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారితో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. 
 
ఇదేసమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఇప్పటివరకూ దాదాపు 600 మందికి ఈ వింత వ్యాధి సోకగా, 450 మందికి పైగా చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారు. పరిస్థితి విషమంగా ఉందని భావించిన కొందరిని మాత్రం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.