మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (13:03 IST)

నైరుతి విస్తరణలో జాప్యం... మొదలుకాని తొలకరి పనులు

rain
తొలకరి జల్లులతో ఆహ్లాదకరంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపుడు తీవ్రమైన ఎండలతో మండిపోతోంది. ఒక విధంగా చెప్పాలంటే నిప్పుల కొలిమిని తలపిస్తుంది. వేసవి సీజన్ ముగిసిపోవడమే కాకుండా, జూన్ నెల కూడా సగం రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ వడగాలులు, ఎండల తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 
 
దీనికితోడు రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రమంతా విస్తరించకుండా ఉసూరనిపిస్తున్నాయి. మరింత సమయం పట్టే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఖరీఫ్ పంటల సాగు తీవ్ర ఆలస్యమవుతోంది. మరో రెంమూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో పురోగతి ఉంటుందని ఆదివారం బులెటిన్‌లో ఐఎండీ పేర్కొంది. 
 
కాగా, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. రాజస్థాన్‌లో కొనసాగుతున్న వాయుగుండం పూర్తిగా బలహీనమయ్యే వరకు దక్షిణాదిలో నైరుతి రుతుపవనాలు బలపడవని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. 
 
కాగా ఈ నెల 25వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడి ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉంది. అప్పుడు ఉత్తర కోస్తాకు రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఒకరు అంచనా వేశారు. ఆదివారం రాష్ట్రంలోని 217 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 145 మండలాల్లో గాడ్పులు వీచాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 46 డిగ్రీలు నమోదైంది.